Omicron: కొన్ని జిల్లాల్లో 700శాతం పెరిగిన కేసులు.. చర్యలు తీసుకోండి.. ఐదు రాష్ట్రాలకే కేంద్రం లేఖ

By Pratap Reddy KasulaFirst Published Dec 4, 2021, 5:55 PM IST
Highlights

దేశంలో ఒమిక్రాన్ భయాలు వ్యాపిస్తున్న తరుణంలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులూ భారీగా పెరుగుతున్నాయన్న వార్త మరింత ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 14 జిల్లాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతన్నాయని, ఇందులోని కొన్ని జిల్లాల్లో కేసుల పెరుగుదల సుమారు 700శాతంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగానే ఆ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌కు లేఖ రాసింది. చర్యలు తీసుకుని, పరిస్థితులను అదుపులో ఉంచాలని వివరించింది.

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ Omicron నేపథ్యంలో ఎక్కడ కరోనా పాజిటివ్(Positive) తేలినా ఏ వేరియంట్ అనే చర్చలు జరుగుతున్నాయి. మన దేశంలో ఇప్పటి వరకు మూడు ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కొందరు నిపుణులు మన దేశంలో ఇది వరకు చాలా కేసులు ఉండి ఉండవచ్చని, చాలా నగరాల్లో ఈ కేసుల ఉనికి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాల్లో కేసులు గణనీయంగా పెరగడం కొత్త ఆందోళనలు రేపుతున్నాయి. ఉన్నట్టుండి కొన్ని జిల్లాల్లో కేసులు సుమారు 700శాతం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది. 

కేంద్ర ఆరోగ్య శాఖ(Union Health Ministry) కార్యదర్శి రాజేశ్ భూషణ్ కర్ణాటక, ఒడిశా, మిజోరం, కేరళ, తమిళనాడు సహా కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌కూ లేఖలు రాశారు. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కరోనా కేసులు గణనీయంగా పెరగడాన్ని ప్రస్తావించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్, కొవిడ్ నిబంధనల స్ట్రాటజీని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పరిస్థితులను కంట్రోల్‌లో పెట్టాలని తెలిపారు. మొత్తం 14 జిల్లాల్లో కేసుల పెరుగుదలను ఆయన పేర్కొన్నారు. అందులో 13 జిల్లాల్లో గత నెలలో నమోదైన కేసులు దేశంలోని నమోదైన మొత్తం కేసుల్లో 55.87 శాతంగా ఉన్నాయని వివరించారు.

Also Read: Omicron: దేశంలోని చాలా నగరాల్లో ఒమిక్రాన్.. రెండో కేసు వాస్తవాన్ని వెల్లడిస్తోంది.. సీసీఎంబీ డైరెక్టర్ అంచనా

తొలిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రెండూ కర్ణాటకలో రిపోర్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకరు దక్షిణాఫ్రికా పర్యటించి వచ్చిన ఓ విదేశీయుడు ఉండగా, మరొకరు బెంగళూరుకు చెందిన ఓ వైద్యుడు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ కర్ణాటకకు రాసిన లేఖలో బెంగళూరు అర్బన్‌లో వారాల వారీగా మరణాల సంఖ్య పెరిగినట్టు గుర్తించామని పేర్కొన్నారు. నవంబర్ 25తో ముగిసిన వారంలో బెంగళూరు అర్బన్‌లో ఎనిమిది కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని, అదే డిసెంబర్ 2వ తేదీతో ముగిసిన వారంలో ఈ మరణాల సంఖ్య 14కు చేరిందని తెలిపారు. ఇవే రెండు వారాల వ్యవధిలో కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కొత్త కేసుల సంఖ్య 152 శాతం పెరిగిందని వివరించారు. 

మిజోరంలోనూ పాజిటివిటీ రేటు గరిష్టంగా 17 శాతాన్ని తాకుతున్నదని కేంద్రం ఆ లేఖలో పేర్కొంది. మిజోరంలో అధిక కేసులు నమోదు చేస్తున్న జిల్లాల్లో చంపాయి ఒకటి అని వివరించింది. ఒడిశాలో వారాలవారీ కరోనా టెస్టుల సంఖ్య తగ్గాయి. నవంబర్ 26వ తేదీతో ముగిసిన వారంలో 4,01,164 టెస్టులు చేయగా డిసెంబర్ 3వ తేదీతో ముగిసే వారంలో 3,88,788 టెస్టుల సంఖ్యకు తగ్గాయని కేంద్రం తెలిపింది. ఈ రాష్ట్రంలోని ధేంకనాల్ జిల్లాలో కరోరనా కేసులు గత 14 రోజుల్లో 666శాతం పెరిగాయని వివరించింది.

Also Read: Omicron Variant : భారత్‌లో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. గుజరాత్‌లో కొత్తగా ఒకరికి, దేశంలో మూడుకు చేరిన కేసులు

జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలో కరోనా కేసులు 736 శాతం పెరిగాయని వివరించింది. కేరళలో డిసెంబర్ 3తో ముగిసే నెల వ్యవధిలో 1,71,521 కేసులను రిపోర్ట్ చేసిందని, ఇది దేశంలోని మొత్తం కేసుల్లో 55శాతంగా ఉన్నాయని తెలిపింది. వారాల వారీగా మరణాల సంఖ్య కూడా కేరళలో పెరిగింది. నవంబర్ 26తో ముగిసే వారం వ్యవధిిలో 1,890 కరోనా మరణాలు సంభవించగా, డిసెంబర్ 3వ తేదీతో ముగిసే వారంలో 2,118 మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపింది.

click me!