
Pahalgam Terrorist Attack : జమ్మూ కాశ్మీర్ పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీ ప్రాంతంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు లేకపోవడంతో ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే పర్యాటకులు ఎక్కువగా వచ్చే ఈ ప్రాంతంలో భద్రత ఎందుకులేదని ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇంత పెద్దఎత్తున పర్యాటకులు వచ్చే ప్రాంతంలో సైన్యం ఎందుకు లేదని ప్రశ్నించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వంటి పలువురు నాయకులు కూడా ఈ ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి ముందు తగిన నిఘా, నివారణ చర్యలు తీసుకున్నారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
దానికి సమాధానంగా బైసరన్ ప్రాంతం శాశ్వతంగా కాపలా ఉన్న ప్రదేశం కాదని కేంద్రం తెలిపారట. ప్రతి సంవత్సరం జూన్ చివరిలో ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రకు ముందు మాత్రమే అక్కడ భద్రతా దళాలను మోహరిస్తామని తెలిపారు.
ఈ ప్రాంతం యాత్రికులు అమర్‌నాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలో భాగం... యాత్ర సమయంలోనే బైసరన్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. “యాత్ర సమయంలో మాత్రమే ఈ ప్రాంతంలో భద్రత, సైన్యం ఉంటుంది” అని సమావేశంలో ప్రభుత్వం తెలిపింది.
ఏప్రిల్‌లో ఆ ప్రాంతంలో పర్యాటకులు ఉండరని అధికారులు వివరించారు. అయితే స్థానిక టూర్ ఆపరేటర్లు ఏప్రిల్ 20 నుంచే పర్యాటకులను బైసరన్‌కు తీసుకెళ్లడం ప్రారంభించారని తెలిసింది. స్థానిక యంత్రాంగానికి ఈ ప్రారంభ పర్యాటక కార్యకలాపాల గురించి తెలియకపోవడంతో దాడి సమయంలో భద్రతా సిబ్బంది అక్కడ లేరని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ఈ సమావేశంలో ప్రసంగించిన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా... దాడికి ముందు అందిన నిఘా సమాచారాన్ని పంచుకున్నారు. ఉగ్రవాదుల కదలికలు, వారు ఉపయోగించిన ఆయుధాలు, దాడి తర్వాత భద్రతా దళాలు తీసుకున్న చర్యల వివరాలను ఆయన 20 నిమిషాల ప్రజెంటేషన్‌లో చేర్చారు.ఇలాంటి లోపాలు జరగకుండా చూసుకోవడానికి బైసరన్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో పర్యాటక కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను సమీక్షిస్తామని ప్రభుత్వం నొక్కి చెప్పింది.
దాడికి భారతదేశం యొక్క దౌత్య, వ్యూహాత్మక స్పందనతో సహా జాతీయ భద్రతా సమస్యలను కూడా సమావేశంలో చర్చించారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ సైనిక అటాచీలను బహిష్కరించడం, అట్టారీ భూ సరిహద్దును మూసివేయడం వంటివి ఇందులో ఉన్నాయి.
భారతదేశం ప్రస్తుతం మళ్లించిన నీటిని నిల్వ చేసే సామర్థ్యం లేకపోతే సింధు జలాల ఒప్పందాన్ని ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించగా, ఈ చర్య ప్రతీకాత్మకమైనదే అయినప్పటికీ, ప్రాముఖ్యత కలిగినదని ప్రభుత్వం స్పష్టం చేసింది. “పాకిస్తాన్‌కు స్పష్టమైన, బలమైన సందేశం పంపడానికే ఈ నిర్ణయం. ఈ నిర్ణయం కేవలం నీటి గురించి మాత్రమే కాదు. ఇది మా విస్తృత వ్యూహాత్మక ఉద్దేశ్యాన్ని ప్రతిబింబిస్తుంది” అని ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు.
కేంద్రం ఇచ్చిన వివరణలతో అందరు ప్రతిపక్ష నాయకులు పూర్తిగా సంతృప్తి చెందలేదు. అయితే వివరణాత్మక బ్రీఫింగ్‌ను వారు అంగీకరించారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా ఉండటానికి మరింత అప్రమత్తత, కమ్యూనికేషన్ అవసరమని పిలుపునిచ్చారు.