Odisha Train Accident: ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ.. ఆ తర్వాతే కారణాలు తెలుస్తాయి: అశ్విని వైష్ణవ్

By Sumanth KanukulaFirst Published Jun 3, 2023, 9:38 AM IST
Highlights

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 238 మంది మృతి చెందగా.. 600 మందికిపైగా గాయపడ్డారని రైల్వే అధికారులు ప్రకటించారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకు 238 మంది మృతి చెందగా.. 600 మందికిపైగా గాయపడ్డారని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పటికీ ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రమాద స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పరిశీలించారు. ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యల గురించి ఆరా తీసిన అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది పెద్ద విషాదకరమైన ప్రమాదం. రైల్వే, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నాయి. సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందించబడతాయి. ఈ ప్రమాదంపై వివరణాత్మక ఉన్నత స్థాయి విచారణ నిర్వహించబడుతుంది. రైలు భద్రతా కమిషనర్ స్వతంత్ర విచారణ కూడా చేస్తారు’’ అని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టి రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లపై ఉందని తెలిపారు. జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి వచ్చిన తర్వాత పునరుద్ధరణ ప్రారంభిస్తామని చెప్పారు. 

Also Read: ఒడిశా రైలు ప్రమాదం : 233 కు చేరిన మృతులు.. 48 రైళ్లు రద్దు, 38 రైళ్ల దారి మళ్లింపు..

ఇదిలా ఉంటే.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. అక్కడే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను అధికారులు వారికి వివరించారు. 

ఇక,రైలు ప్రమాదంలో నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం శనివారం సంతాప దినంగా ప్రకటించింది. ఇక,ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదం కారణంగా గోవా-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఫ్లాగ్‌ఆఫ్ వేడుకను రద్దు చేసినట్లు కొంకణ్ రైల్వే అధికారులు తెలిపారు.ఇదిలా ఉంటే.. రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

‘‘శుక్రవారం సాయంత్రం 7 గంటలకు, షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ 10-12 కోచ్‌లు బాలేశ్వర్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. కొంత సమయం తరువాత, యశ్వంత్‌పూర్ నుంచి హౌరాకు వెళ్లే మరొక రైలు పట్టాలు తప్పిన కోచ్‌లలోను ఢీకొట్టింది. ఫలితంగా ఆ రైలు 3-4 కోచ్‌లు పట్టాలు తప్పాయి’’ అని అమితాబ్ శర్మ చెప్పారు. 

click me!