పంజరాన చిలక.. సీబీఐ : మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Aug 18, 2021, 3:12 PM IST
Highlights

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పంజరాన చిక్కుకున్న చిలుక వంటిందని, దానికి స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరముందని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం, కాగ్ తరహాలోనే స్వతంత్ర హోదానివ్వాలని, సీబీఐకి పార్లమెంటుకే జవాబుదారీని చేయాలని సూచించింది. సిబ్బంది, డివిజన్లు, వింగ్స్‌ను పెంచుకుని ప్రస్తుత నిర్మాణాన్ని మార్చుకోవాలని సీబీఐ చీఫ్‌ను ఆదేశించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆరు వారాల్లో ప్రతిపాదనలు పంపాలని, కేంద్రం అందుకు అనుగుణంగా మూడు నెలల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
 

చెన్నై: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐని పంజరాన చిక్కుకున్న చిలకగా అభివర్ణిస్తూ దానికి స్వేచ్ఛనివ్వాలని తెలిపింది. దీనికి స్వతంత్ర హోదానివ్వాల్సిన అవసరముందని నొక్కిచెప్పింది. ఎన్నికల సంఘం, కాగ్ తరహాలో స్వతంత్ర హోదా సీబీఐకి ఉండాలని తెలిపింది. అది కేవలం పార్లమెంటుకే జవాబుదారీ కలిగి ఉండాలని సూచించింది. సీబీఐలో మార్పు చేర్పులు చేయాలని, సిబ్బందిని పెంచుకోవాలని, డివిజన్లు, వింగ్స్ పెంచుకోవాలని తెలిపింది. వీటిపై కేంద్రానికి ఆరువారాల్లో ప్రతిపాదనలు పంపాలని సీబీఐ చీఫ్‌ను ఆదేశించింది. ప్రతిపాదనలు అందిన మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం అందుకు అనుకూల ఉత్తర్వులు విడుదల చేయాలని తెలిపింది.

అవినీతి ఆరోపణలు, నేరాలు, ఇతర చాలా వరకు అభియోగాలను విచారించడానికి అందరికి వెంటనే గుర్తువచ్చేది సీబీఐనే. కానీ, ఇటీవలే ఈ ఏజెన్సీని కేంద్ర ప్రభుత్వం తనకు అస్త్రంగా వాడుకుంటుందన్న ఆరోపణలు పెరిగాయి. ఈ ఆరోపణలు ఇతర హయాంలోనూ ఉన్నవే. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ చిట్ ఫండ్ స్కామ్ కేసు విచారిస్తున్న న్యాయమూర్తులు ఎన్ కిరుబాకరణ్, బీ పుగలెందిల ధర్మాసనం సీబీఐని బలోపేతం చేయాలని సూచించింది. ప్రజలకు సీబీఐపై అపారనమ్మకమున్నా, పలు కేసుల్లో దర్యాప్తు చేయడానికి సీబీఐ వెనుకంజ వేసిందని పేర్కొంది. ఇందుకు కారణంగా వనరులలేమి, సిబ్బందిలేమిని పేర్కొంటూ ఉంటుందని తెలిపింది. 

సీబీఐకి సిబ్బందితోపాటు అదనపు వనరుల అవసరమూ ఉన్నదని మదురై బెంచ్ అభిప్రాయపడింది. సీబీఐ ప్రస్తుత నిర్మాణాన్ని మార్చుకోవాలని సూచించింది. సీబీఐ కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగాలని తెలిపింది. ప్రభుత్వ కార్యదర్శికి ఉండే అధికారులు సీబీఐ చీఫ్‌కు ఉండాలని వివరించింది. యూకే, యూఎస్‌లలో ఉండే దర్యాప్తు ఏజెన్సీలకు తగ్గకుండా సీబీఐకి సదుపాయాలు కల్పించాలని పేర్కొంది.

ప్రస్తుతం సీబీఐ కేసు వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సన్నల్ అండ్ ట్రెయినింగ్ శాఖకు సమర్పిస్తుంది. సీబీఐ డైరెక్టర్‌ను ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతల ప్యానెల్ ఎంపిక చేస్తుంది. సీబీఐకి సిబ్బంది పెరిగితే చాలా కేసుల్లో విచారణ వేగంగా సాధ్యపడవచ్చని కోర్టు అభిప్రాయపడింది.

click me!