అలాంటి పరిస్థితుల్లో ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిగిందని నమ్మలేం..! నిందితుడిపై ఎఫ్ఐఆర్ కొట్టేసిన హైకోర్టు

By Mahesh KFirst Published Jan 2, 2023, 8:39 PM IST
Highlights

మహారాష్ట్రలో ఇద్దరు పిల్లలున్న వితంతువు తనపై పలుమార్లు రేప్ జరిగిందని ఓ వ్యక్తిపై కేసు పెట్టింది. అలాగే, అతడు తనకు సహాయపడటానికీ చాలాసార్లు వచ్చేవాడని, కొన్ని సార్లు తానే అతడిని నమ్మి ఏటీఎం కార్డు కూడా ఇచ్చానని పేర్కొంది. జనసమ్మర్దమైన ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో ఉన్న వితంతువుపై పలుమార్లు బలవంతంగా అత్యాచారం  జరిగిందనడం నమ్మశక్యంగా లేదని నిందితుడి తరఫు న్యాయవాది వాదించాడు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు కేసు కొట్టేసింది.
 

న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు ఔరంగబాద్ డివిజన్ బెంచ్ ఓ రేప్ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. జనసమ్మర్ధంగా ఉన్న ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో నివసిస్తున్న వితంతువుపై పలుమార్లు అత్యాచారం జరిగిందని చెప్పడం నమ్మశక్యంగా లేదని తెలిపింది. బాధితురాలి భర్త 2017 మార్చి 18వ తేదీన మరణించాడు. అదే ఏడాది  జులై 13న నిందితుడు తన ఇంటికి తాగు నీటి కోసం వచ్చి కత్తితో బెదిరించాడని బాధితురాలు పేర్కొంది. చంపేస్తానని బెదిరించి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. 

అంతేకాదు, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా తిరస్కరించడంతో నగలు లాక్కెళ్లాడని, వాటిని నగల వ్యాపారి దగ్గర తాకట్టు పెడతానని చెప్పినట్టు ఆ మహిళ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత నిందితుడు తనపై చాలా సార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, దాడి కూడా చేశాడని ఎఫ్ఐఆర్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రస్తావించారు.

కాగా, ఈ ఆరోపణలు అన్నీ అవాస్తవాలని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. ఆ వితంతు తన ఇద్దరు పిల్లలతో జన్మసమ్మర్ద ప్రాంతంలో నివసిస్తున్నారని, నిందితుడు ఆమెకు చాన్నాళ్ల నుంచి పరిచయం ఉన్నవాడే అని చెప్పారు. నగల వ్యాపారి కూడా ఆమె ఒత్తిడి మేరకు తాకట్టుకు ఆభరణాలు తీసుకున్నాడని స్టేట్‌మెంట్ ఇచ్చాడని వివరించారు. బాధితురాలి తల్లిదండ్రులు కూడా తమకు ఈ అత్యాచారాల గురించిన వివరాలు తెలియవని స్టేట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. ఆమె తమ వద్దకు రాలేదని, తమను కూడా ఆమె వద్దకు రానివ్వలేదని పేరెంట్స్ తెలిపినట్టు చెప్పారు.

Also Read: సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగపోతే.. బాధితులు ఎక్కడికి వెళ్లాలి: డీసీడబ్యూ చీఫ్ స్వాతి మలివాల్

బాధితురాలి తరఫు న్యాయవాది వాదిస్తూ.. తన క్లయింట్ పై నిందితుడు పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, ఆమెను, ఆమె పిల్లలనూ చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి చార్జి షీటు కూడా ఫైల్ అయిందని, కాబట్టి, నిందితుడికి ట్రయల్స్ ప్రారంభించాలని కోరారు.

బాధితురాలు ఆరు నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ఆ జాప్యాన్ని వదిలిపెట్టినా ఆమె సప్లిమెంటరీ స్టేట్‌మెంట్‌లో నిందితుడు తమ ఇంటికి తరుచూ వస్తుండేవాడని, కొన్ని సార్లు తనకు సహకరించడానికి కూడా వచ్చేవాడని పేర్కొన్నదని డివిజన్ బెంచ్ ప్రస్తావించింది. కొన్నిసార్లు నిందితుడికి ఆమె ఏటీఎం కూడా ఇచ్చిందని పేర్కొందని, అంటే వారి మధ్య పరిచయం దీర్ఘకాలం నుంచే ఉండి ఉంటుందని, బహుశా ఆమె భర్త సజీవంగా ఉన్నప్పటి నుంచే అతను వారికి పరిచయస్తుడై ఉండొచ్చని కోర్టు పేర్కొంది.

తల్లిదండ్రులు, నగల వ్యాపారి స్టేట్‌మెంట్లు చూసినా, అంతజనసమ్మర్ద ప్రాంతంలో ఇద్దరు  పిల్లలతో నివసిస్తున్న ఆ వితంతువుపై పలుమార్లు అత్యాచారం జరిగిందని చేస్తున్న ఆరోపణలు నమ్మశక్యంగా లేవని కోర్టు వివరించింది.

పై విషయాలను గమనించి, పరిగణనలోకి తీసుకున్నాక వారి మధ్య ఒక వేళ శారీరక కలయిక జరిగి ఉంటే ఇద్దరి అంగీకారంతో జరిగి ఉంటుందనే భావిస్తున్నట్టు కోర్టు తెలిపింది. కాబట్టి, నిందితుడిని ట్రయల్ ఫేస్ చేయాలని ఆదేశించడం సరికాదని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కొట్టేసింది.

click me!