Year Ender 2023: ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎన్ని గెలిచింది?

By Mahesh K  |  First Published Dec 14, 2023, 8:23 PM IST

2023 సంవత్సరంలో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 6 రాష్ట్రాల్లో బీజేపీ హవా నడిచింది. అధికారాన్ని కొనసాగించడం లేదా.. అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ మాత్రం రెండు రాష్ట్రాలను కోల్పోతే.. మరో రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టింది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల పై ప్రత్యేక కథనం.
 


అసెంబ్లీ ఎన్నికలు: 2023 సంవత్సరంలో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఈశాన్యంలోని చిన్న రాష్ట్రాలతోపాటు మధ్యభారతంలోని పెద్ద రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది కూడా బీజేపీ హవానే కనిపించింది. కాంగ్రెస్ అక్కడక్కడ తళుక్కుమన్నా.. మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీనే తన అధికారాన్ని కొనసాగించింది.

ఈ ఏడాది తొలినాళ్లలో అంటే ఫిబ్రవరి నెలలో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈశాన్యంలోని త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 27వ తేదీన మేఘాలయా, నాగాల్యాండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మే నెలలో కర్ణాటకకు, నవంబర్‌లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

Latest Videos

త్రిపుర:

త్రిపురలో ఐదుసార్లు అధికారాన్ని కొనసాగించిన సీపీఎం‌కు ఫుల్ స్టాప్ పెడుతూ 2018లో బీజేపీ వియజపతాకాన్ని ఎగరేసింది. 2023లోనూ బీజేపీ కూటమినే అధికారాన్ని చేజిక్కించుకుంది. మాణిక్ సాహా సీఎంగా.. బీజేపీ, ఐపీఎఫ్‌టీల కూటమి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 60 స్థానాల త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాలు గెలుచుకుంది.

మేఘాలయా:

60 స్థానాల మేఘాలయ  అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27వ తేదీన జరిగాయి. ఎన్‌పీపీ 28 స్థానాలు, యూడీపీ 12 సీట్లు, బీజేపీ 2 స్థానాల గెలుచుకున్నాయి. 2018లో ఎన్‌పీపీ, యూడీపీ, బీజేపీ, హెచ్‌ఎస్‌పీడీపీలు పొత్తుతో ఎన్నికల బరిలో దిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2023లో మాత్రం వేటికవిగా పోటీ చేసి తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

Also Read: IAS Amrapali: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి రేవంత్ సర్కారు కీలక బాధ్యతలు.. స్మితా సబర్వాల్ పరిస్థితి ఏమిటీ?

నాగాల్యాండ్:

నాగాల్యాండ్‌కు కూడా మేఘాలయాతోపాటు ఫిబ్రవరి 27వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఎన్‌డీపీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 60 స్థానాల అసెంబ్లీ ఎన్నికల్లో 2018లోనే కాదు.. 2023లోనూ అధికారాన్ని కొనసాగించింది. ఎన్‌డీపీపీ 25 స్థానాలు, బీజేపీ 12 సీట్లు గెలుచుకున్నాయి.

కర్ణాటక:

కర్ణాటకలో మాత్రం బీజేపీకి ఎదురుగాలి వీచింది. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ ఎన్నికల్లో ఓడిపోయింది. సిద్ధరామయ్య సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరిగాయి. కాంగ్రెస్ గతంలో కంటే 55 సీట్లు అధికంగా గెలుచుకుంది. మొత్తంగా మెజార్టీ మార్క్‌ను దాటి 135 స్థానాలు కైవసం చేసుకుంది. అదే బీజేపీ 38 స్థానలు నష్టపోయి 66 సీట్లకే పరిమితమైంది.

మిజోరం:

ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికలు నవంబ్ 7వ తేదీన జరిగాయి. మిజోరంలో అధికార బదిలీ జరిగింది. ఇక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ గద్దె దిగింది. జోరందంగా సీఎంగా రాజీనామా చేశారు. 2018లోనే ఒక ఉద్యమంగా వచ్చిన జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ ఈ ఎన్నికల్లో విజృంభించింది. 40 సీట్లకు గాను 27 స్థానాలు గెలుచుకుని ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా లాల్ దుహోమా పగ్గాలు చేపట్టాడు. ఇక్కడ బీజేపీ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని మొత్తంగా 2 సీట్లను కైవసం చేసుకుంది.

Also Read: Telangana Assembly: పంతం నెగ్గించుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. నేడు ప్రమాణం

ఛత్తీస్‌గడ్: 

ఛత్తీస్‌గడ్‌లో భుపేశ్ బఘేల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ గద్దె దింపింది. ఇక్కడ విష్ణు దేవ్ సాయి సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 90 స్థానాలున్న ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ గతంలో కంటే 33 సీట్లను కోల్పోయి 35 సీట్లకే పరిమితమైంది. అదే బీజేపీ 39 స్థానాలను అదనంగా కొల్లగొట్టి 54 స్థానాల్లో గెలుపు ఖరారు చేసుకుంది. ఛత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికలు నవంబర 7వ, 17వ తేదీల్లో రెండు దశల్లో జరిగాయి.

రాజస్తాన్:

200 స్థానాలున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 25వ తేదీన జరిగాయి. ఇక్కడ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర పరాజయాన్ని నమోదు చేసుకుంది. గతంలో 100 సీట్లు గెలుచుకుంటే.. ఈ సారి 69 స్థానాలను మాత్రం సొంతం చేసుకుంది. బీజేపీ గతంలో కంటే 42 సీట్లు అదనంగా గెలుచుకుని మొత్తం 115 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భజన్ లాల్ శర్మ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.

మధ్యప్రదేశ్:

230 స్థానాలున్న మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17వ తేదీన జరిగాయి. ఇక్కడ బీజేపీ మళ్లీ అధికారాన్ని కొనసాగించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు (బీజేపీ 109 సీట్లు) గెలుచుకుని సీఎంగా కమల్ నాథ్ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ, జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు.. ఆయన బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2023 ఎన్నికల్లో బీజేపీ 163 స్థానాలను, కాంగ్రెస్ 66 స్థానాలను గెలుచుకున్నాయి. మోహన్ యాదవ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Also Read: Parliament Security Breach: ముందుగానే రెక్కీ చేశారు.. 18 నెలల ప్లాన్ ఇదీ!.. నిందితుల గురించి కీలక వివరాలు

తెలంగాణ: 

119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తేదీన జరిగాయి. ఇక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ పైచేయి సాధించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన 2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ ఓడించింది. 2018లో 88 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ఈ సారి 39 సీట్లను గెలుచుకుంది. అదే కాంగ్రెస్ 2018లో 19 సీట్లనే గెలుచుకుంది. కానీ, ఈసారి తుఫాను‌లా 64 సీట్లను సాధించుకుని రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ కూడా ఒక్క సీటు నుంచి 8 సీట్లకు బలాన్ని పెంచుకుంది.

ఈ ఏడాది జరిగిన 9 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 6 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేసింది. కాంగ్రెస్ మాత్రం రెండు రాష్ట్రాల్లో (ఛత్తీస్‌గడ్, రాజస్తాన్‌)లలో అధికారాన్ని కోల్పోయి కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

click me!