లోక్‌సభలోకి చొరబడి గందరగోళానికి కారణమైన నిందితులకు ఢిల్లీ కోర్ట్ 7 రోజుల కస్టడీ విధించింది . పట్టుబడిన సాగర్ శర్మ, డి మనోరంజన్, పార్లమెంట్ వెలుపల అరెస్ట్ అయిన నీలం దేవి, అమోల్ షిండేలను ప్రశ్నించాల్సి వుందని దర్యాప్తు అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
లోక్‌సభలోకి చొరబడి గందరగోళానికి కారణమైన నిందితులకు ఢిల్లీ కోర్ట్ 7 రోజుల కస్టడీ విధించింది. నలుగురు నిందితులకు కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం లోక్‌సభ వెలుపల పట్టుబడిన సాగర్ శర్మ, డి మనోరంజన్, పార్లమెంట్ వెలుపల అరెస్ట్ అయిన నీలం దేవి, అమోల్ షిండేలను ప్రశ్నించాల్సి వుందని దర్యాప్తు అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరు వ్యక్తులు లోక్‌సభలోకి ప్రవేశించి షూ లోపల దాచిన పొగ డబ్బాల నుంచి పసుపు రంగు పొగను వదిలిన ఘటనలో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
లక్నోకు చెందిన సాగర్ శర్మ, మైసూర్‌కు చెందిన డి మనోరంజన్‌లు స్మోక్ బాంబులను పార్లమెంట్‌లో వదిలారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఎంపీలు భయాందోళనలకు గురయ్యారు. వారిద్దరిని పలువురు ఎంపీలు, భద్రతా సిబ్బంది వెంటనే పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరికి విజిటర్స్ పాస్‌లు దొరకపోవడంతో వారు పార్లమెంట్ వెలుపలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నలుగురిపై కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు.
ఈ సంఘటన ఉగ్రదాడిని పోలి వుందని పోలీసులు కోర్టులో వాదించారు. ఈ ఘటన కేవలం వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచడమా లేదంటే దీని వెనుక ఉగ్రవాద సంస్థ ప్రమేయం వుందా అనే దానిపై దర్యాప్తు చేయాలని పోలీసులు కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితులు లక్నోలో రెండు జతల బూట్లు కొనుగోలు చేసి పార్లమెంట్‌కు వచ్చారని పోలీసులు తెలిపారు. స్మొక్ కంటైనర్‌లను ముంబై నుంచి కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. నిందితులు వారి వెంట కొన్ని కరపత్రాలను కూడా తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ప్రత్యేక న్యాయమూర్తి హర్దీప్ కౌర్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు వారిని 15 రోజుల కస్టడీకి కోరారు. అయితే జడ్జి కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చారు.
కాగా.. బుధవారం లోక్ సభలోని పబ్లిక్ గ్యాలరీ నుంచి ఇద్దరు నిందితులు భద్రతను ఉల్లంఘించి చట్ట సభ్యుల బెంచీల వైపుగా దూసుకెళ్లారు. వారి వెంట తెచ్చుకున్న క్యానిస్టర్లు తెరిచి పసుపు వర్ణంలోని పొగను చిమ్మారు. ఈ ఘటనతో పార్లమెంటులో, దేశమంతటిలో అలజడి రేగింది. ఈ ఘటనకు సంబంధించి కీలక వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఈ ఘటనకు కొన్ని నెలల ముందే ప్రణాళికను రచించినట్టు తెలిసింది. నిందితుడు డీ మనోరంజన్ ముందుగానే రెక్కీ కూడా నిర్వహించారు.
పార్లమెంటు భవనంలోని సెక్యూరిటీ గురించి, భద్రతా చర్యల గురించి వివరాలు కనుక్కున్నాడు. గతంలోనే వ్యాలిడ్ పాస్‌లు తీసుకుని పార్లమెంటులో విజిటర్స్ గ్యాలరీలోకి మనోరంజన్ వెళ్లాడు. అప్పుడు ఒక విషయాన్ని ఆయన పరిశీలించాడు. విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్లుతున్నవారి షూస్‌ను చెక్ చేయడం లేదని గుర్తించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ పాయింట్ ఆధారంగా నిందితులు ఘటనకు ప్లాన్ చేశారు. మనోరంజన్ తన షూస్‌లోపల కానిస్టర్లు దాచుకునేలా ప్లాన్ చేశాడు. ఈ విధంగానే వారు అన్ని భద్రతా స్థాయిలను దాటుకుని విజిటర్స్ గ్యాలరీలోకి క్యానిస్టర్లను తీసుకెళ్లగలిగారు. విజిటర్స్ గ్యాలరీలో ఉన్నప్పుడు మనోరంజన్ తన షూస్ విప్పి క్యానిస్టర్లు తీయడాన్ని చూశానని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.