
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని ఆమె నివాసంలో సీబీఐ బృందం విచారించడంపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ ముందు తలవంచడానికి సిద్ధంగా లేని ప్రతిపక్ష నేతలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వేధిస్తున్నారు’’ అని ఆమె ఆరోపించారు.
‘‘ఈ రోజు రబ్రీదేవిని వేధిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబం లొంగిపోలేదు. అందుకే వారిని ఏళ్ల తరబడి వేధిస్తున్నారు. వారు ప్రతిపక్షాల గొంతు నొక్కాలని బీజేపీ చూస్తోందని’’ అని ఆమె ఆరోపించారు.
కాగా.. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో తదుపరి దర్యాప్తునకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం సోమవారం రబ్రీదేవిని పాట్నాలోని ఆమె నివాసంలో విచారించింది. అయితే ఇందులో ఎలాంటి సెర్చ్, దాడులు జరగలేదని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసిందని, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులతో సహా నిందితులకు మార్చి 15న ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిందని అధికారులు తెలిపారు.
సీబీఐ రబ్రీదేవి నివాసానికి చేరుకున్నప్పుడు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అక్కడే ఉన్నారు. ఈ విషయంలో ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడారు. ‘‘ విశ్వాస పరీక్ష జరుగుతున్న రోజు, మా మహాకూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు, ఈ సిరీస్ కొనసాగుతుందని నేను చెప్పాను. మార్చి 15న విచారణ ఉంది. అయితే ఇది బెయిల్ కోసం సాధారణ ప్రక్రియ’’ అని పేర్కొన్నారు.
ఆరేళ్లలో యూపీలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు: యోగి ఆదిత్యనాథ్
‘‘మీరు బీజేపీలో కొనసాగితే రాజా హరిశ్చంద్రుడవుతారు. మహారాష్ట్రలో శరద్ పవార్ మేనల్లుడు (అజిత్ పవార్) బీజేపీలోకి వెళ్లినప్పుడు కేసులన్నీ ఉపసంహరించుకున్నారు. టీఎంసీకి చెందిన ముకుల్ రాయ్ బీజేపీలోకి వచ్చినప్పుడు కేసులన్నీ ఉపసంహరించుకున్నారు. బీజేపీకి ఎదురునిలిస్తే దాడులు జరుగుతాయి’’ అని అన్నారు.
సీబీఐ విచారణపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ సీనియర్ నాయకురాలు రబ్రీదేవి మాట్లాడుతూ.. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే కేంద్ర సంస్థలు ఆయన వెంట నడుస్తున్నాయని అన్నారు. ‘‘నేను ఎక్కడికీ పారిపోను. గత 30 ఏళ్లుగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. బీహార్ లో లాలూ యాదవ్ ను చూసి బీజేపీ భయపడుతోంది’’ అని తెలిపారు. ప్రధాని మోదీ ప్రతి ఒక్కరినీ పారిపోయేలా చేస్తున్నారని అమె అన్నారు. నీరవ్ మోడీ పారిపోవడానికి ఆయన సహకరించారని ఆరోపించారు.
కాగా.. 2004-2009 మధ్య కాలంలో ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి బహుమతిగా ఇచ్చిన లేదా విక్రయించిన భూములకు బదులుగా రైల్వేలో నియామకాలు జరిగాయని ఈ కేసు నమోదైంది. బీహార్ లోని పాట్నాకు చెందినప్పటికీ కొందరు వ్యక్తులను 2004-2009 మధ్యకాలంలో ముంబై, జబల్ పూర్, కోల్ కతా, జైపూర్, హాజీపూర్ లలో ఉన్న రైల్వేలోని వివిధ జోన్లలో గ్రూప్-డి పోస్టులకు ప్రత్యామ్నాయంగా నియమించారని, దానికి బదులుగా వారి కుటుంబ సభ్యులు తమ భూమిని ప్రసాద్ కుటుంబ సభ్యుల పేరిట, ఒక కంపెనీ పేరిట బదిలీ చేశారని ఎఫ్ఐఆర్ లో సీబీఐ ఆరోపించింది.