
ముంబయి: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన ఓ రైతు నాలుగు నెలలు కష్టపడి పండించిన ఉల్లిని పొలంలోనే కాల్చేశారు. ఆ ఉల్లి పంటను మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మడం కంటే.. నిప్పు పెట్టి బూడిద చేయడమే ఉత్తమమని ఆయన తెలిపారు. ఈ పంట కాల్చివేత కార్యక్రమానికి సీఎం ఏక్‌నాథ్ షిండేకు రక్తంతో రాసిన లేఖతో ఆహ్వానం పంపినట్టు వివరించారు. కానీ, ఆయన రాలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే తాను పంటకు నిప్పు పెట్టుకోవాల్సి వచ్చిందని ఆ రైతు ఆక్రోశించారు. పంటకు కనీస మద్దతు ధర ప్రకటించి, అందుకు అనుగుణంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
నాసిక్ జిల్లా యెవలా తాలూకాకు చెందిన క్రిష్ణ డోంగ్రే అనే రైతు 1.5 ఎకరాల్లో ఉల్లి పంట వేశారు. ఆ పంటను సాగు చేయడానికి ఇప్పటికే దాదాపు రూ. 1.5 లక్షలు ఖర్చు పెట్టుకున్నట్టు డోంగ్రే తెలిపారు. ఇప్పుడు ఆ పంటను వ్యవసాయ మార్కెట్ వరకు చేర్చడానికి మరో రూ. 30 వేల వరకు అవుతాయని అన్నారు. తీరా అక్కడికి తీసుకెళ్లి ఈ పంటను అమ్మినప్పటికీ ప్రస్తుత ధరలకు కేవలం రూ. 25 వేలు మాత్రమే దక్కుతాయని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ తీసుకెళ్లి అమ్మినా తాను నష్టపోతాడని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల తాను, తన వంటి రైతులు నష్టపోతున్నారని డోంగ్రే అభిప్రాయపడ్డారు. ఇప్పటి రేటుకు వాటిని అమ్మినా తన జేబులో నుంచే డబ్బులు పోతాయని వివరించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పక్షాన నిలబడటానికి ఆలోచనలు చేయాలని అన్నారు.
సీఎంకు తాను 15 రోజుల క్రితమే లేఖ రాశానని, పంట కాల్చివేత కార్యక్రమం గురించి ఓ పత్రిక కూడా రాసిందని క్రిష్ణ డోంగ్రే తెలిపారు. ఇన్ని రోజుల సమయం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోలేదని చెప్పారు. కనీసం ఏదో ఒక హామీనైనా ఇవ్వలేదని, ఒక్కరూ తమ దగ్గరకు వచ్చి మాట్లాడలేదని బాధపడ్డారు.