
బిహార్‌లో నాటకీయ ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధాలు వెలుగు చూసి కాపురాలు కూలిపోయిన ఘటనలు అనేకం. వివాహేతర సంబంధాల కారణంగా భార్య, భర్తల మధ్య తీవ్ర ఘర్షణలు. కొన్నిసార్లు చంపేసేదాక వెళ్లిన ఘటనలూ చూశాం. చాలా ఘటనలు కోర్టుల వరకూ చేరుతాయి. కానీ, బిహార్‌లో ఇందుకు భిన్నమైన, ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధం బయటపడిన తర్వాత ఆ భర్త అందరిలా కాకుండా భిన్నంగా వ్యవహరించాడు. ఏకంగా భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చే పెళ్లి చేసేశాడు.
బిహార్‌లోని నవాడ జిల్లాలో జరిగింది. స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం.. నవాడలో ఓ గ్రామానికి చెందిన వివాహిత అదే ప్రాంతానికి చెందిన ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. సాధారణ పరిచయంగా మొదలై.. అక్రమ వ్యవహారం వరకూ వెళ్లారు. ఓ రోజు ఆమె భర్త పని మీద బయటకు వెళ్లినప్పుడు ఆమె ప్రియుడి దగ్గరికి వెళ్లింది. ఆమె ప్రియుడి ఇంటికి వెళ్లడం బంధువులు, స్థానికులు గమనించారు. వెంటనే ఇద్దరినీ పట్టుకుని కట్టేసి తీవ్రంగా కొట్టారు.
అనంతరం, గ్రామ పెద్దలు వారిని పిలిచి పంచాయతీ చేశారు. వారిద్దరినీ ఊరి నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. అంతలోనే ఆమె భర్త ఇంటికి తిరిగి వచ్చాడు. ఇదంతా తెలుసుకున్నాడు. ఎలాంటి ఆవేశకావేశాలకు లోనుకాకుండా.. దాడికి పాల్పడలేదు. చక్కగా వారిని ఊరిలోని గుడిలోకి తీసుకెళ్లాడు. గుడిలోనే పెళ్లి చేశాడు.
Also Read: తెలంగాణ ఎన్నికల ఇంచార్జీగా జవడేకర్, కో ఇంచార్జీగా సునీల్ బన్సల్‌ను నియమించిన బీజేపీ
ఇది చూసి.. భర్త తీరును చూసి ఊరంతా నివ్వెరపోయింది. స్థానికులు ఖంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే, పోలీసులు స్పందిస్తూ.. దీనికి సంబంధించి తమకు ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు చెప్పారు. అయితే, ఆమె ప్రియుడు పెళ్లికాని యువకుడేమీ కాదని తెలిసింది. ఆయనకూ గతంలో మరో యువతితో పెళ్లి జరిగింది. అంతేకాదు, ఆమెతో ఆ వ్యక్తికి ముగ్గురి సంతానం కూడా ఉన్నట్ట సమాచారం.