
Bihar Election 2025 : బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో (చివరి) దశ పోలింగ్ ఇవాళ (మంగళవారం) ఉదయం ప్రారంభమయ్యింది. ఈ దశలో 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది… 1,302 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.7 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేబినెట్‌లోని 12 మంది మంత్రుల భవితవ్యం కూడా ఈ దశలోనే తేలనుంది.
జేడీ(యూ) నేతలు విజేంద్ర యాదవ్ (సుపాల్ అసెంబ్లీ నియోజకవర్గం), లేసి సింగ్ (ధమ్‌దహా), జయంత్ కుష్వాహా (అమర్‌పూర్), సుమిత్ సింగ్ (చకాయ్), మహమ్మద్ జమా ఖాన్ (చైన్‌పూర్), షీలా మండల్ (ఫూల్‌పరాస్) ఉన్నారు. బీజేపీ నుంచి మంత్రులు ప్రేమ్ కుమార్ (గయా), రేణు దేవి (బెట్టియా), విజయ్ కుమార్ మండల్ (సికటి), నితీశ్ మిశ్రా (ఝంఝర్‌పూర్), నీరజ్ బబ్లూ (ఛతాపూర్), కృష్ణానందన్ పాశ్వాన్ (హర్‌సిద్ధి) బరిలో ఉన్నారు. ససారం, ఇమామ్‌గంజ్, మొహానియా, బిహ్‌పూర్, గోపాల్‌పూర్, పిర్‌పైంటి, భాగల్‌పూర్, సుల్తాన్‌గంజ్, నాథ్‌నగర్ ఇతర కీలక నియోజకవర్గాలు.
ససారంలో రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) చీఫ్, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా భార్య స్నేహలతా కుష్వాహా ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నుంచి సతేంద్ర సాహ్ మహాఘటబంధన్ తరఫున బరిలో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్ పార్టీ నుంచి బినయ్ కుమార్ సింగ్‌ను నిలబెట్టింది.
ఇమామ్‌గంజ్ స్థానానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) చీఫ్ జితన్ రామ్ మాంఝీ తన పార్టీ ప్రభావాన్ని మరోసారి పరీక్షిస్తున్నారు. HAM(S) మళ్లీ దీపా కుమారిని ఎన్డీఏ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆమె 2024 నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహాఘటబంధన్ రితు ప్రియా చౌదరిని నామినేట్ చేసింది. జన్ సూరాజ్ పార్టీ అజీత్ కుమార్‌ను బరిలోకి దించింది.
మొహానియాలో గతంలో రాష్ట్రీయ జనతా దళ్ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే సంగీతా కుమారి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) టికెట్‌పై మళ్లీ గెలుపొందాలని చూస్తున్నారు. ఆర్జేడీ అభ్యర్థి శ్వేతా సుమన్ నామినేషన్ రద్దు కావడంతో, బీజేపీ నేత, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే ఛేది పాశ్వాన్ కుమారుడైన స్వతంత్ర అభ్యర్థి రవిశంకర్ పాశ్వాన్‌కు మహాకూటమి మద్దతు ప్రకటించింది.
బిహ్‌పూర్‌లో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే కుమార్ శైలేంద్ర వరుసగా మూడోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన మహాఘటబంధన్ తరఫున అర్పణా కుమారి (వీఐపీ), పవన్ చౌదరి (జన్ సూరాజ్) నుంచి సవాలును ఎదుర్కొంటున్నారు.
గోపాల్‌పూర్‌లో జేడీ(యూ)కు చెందిన శైలేష్ కుమార్ అలియాస్ బూలో మండల్, మహాఘటబంధన్‌కు చెందిన ప్రేమ్ సాగర్ అలియాస్ డబ్లూ యాదవ్ (వీఐపీ), మంకేశ్వర్ సింగ్ అలియాస్ మంటూ సింగ్ (జన్ సూరాజ్)తో పోటీ పడుతున్నారు.
పిర్‌పైంటి (ఎస్సీ) స్థానంలో మురారీ పాసవాన్ (బీజేపీ), రామ్ విలాస్ పాశ్వాన్ (ఆర్జేడీ), ఘనశ్యామ్ దాస్ (జన్ సూరాజ్) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
భాగల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అజీత్ శర్మ, బీజేపీకి చెందిన రోహిత్ పాండే, జన్ సూరాజ్‌కు చెందిన అభయ్ కాంత్ ఝా మధ్య పోటీ ఉంది.
సుల్తాన్‌గంజ్‌లో జేడీ(యూ) సిట్టింగ్ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ మండల్, చందన్ కుమార్ (ఆర్జేడీ), లలన్ కుమార్ (కాంగ్రెస్) మధ్య పోరు సాగుతోంది.
నాథ్‌నగర్‌లో మిథున్ కుమార్ (ఎల్‌జేపీ-ఆర్‌వీ), షేక్ జేయావుల్ హసన్ (ఆర్జేడీ), అజయ్ కుమార్ రాయ్ (జన్ సూరాజ్), మహమ్మద్ ఇస్మాయిల్ (ఏఐఎంఐఎం)తో తలపడుతున్నారు.
చివరి దశలో మొత్తం 122 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇందులో తూర్పు చంపారన్‌లో 11, మధుబని, గయాలలో పదేసి, పశ్చిమ చంపారన్‌లో తొమ్మిది, సీతామర్హిలో ఎనిమిది, భాగల్‌పూర్, రోహ్‌తాస్, పూర్నియా, కతిహార్‌లలో ఏడేసి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అరారియా, ఔరంగాబాద్‌లలో ఆరేసి అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది. నవాడా, బంకా, సుపాల్‌లలో ఐదేసి స్థానాల్లో పోటీలు జరుగుతోంది. కైమూర్, జమూయి, కిషన్‌గంజ్‌లలో నాలుగేసి, జహానాబాద్‌లో మూడు, అర్వాల్‌లో రెండు, షియోహర్ జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానంలో పోలింగ్ జరుగుతోంది.
ఇవాళ పోలింగ్ జరగనున్న అన్ని స్థానాల్లో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 42 స్థానాల్లో గెలుపొందగా, ఆర్జేడీ 33 స్థానాల్లో విజయం సాధించింది. జనతాదళ్ (యునైటెడ్) 20, కాంగ్రెస్ 11, వామపక్ష పార్టీలు కలిసి ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి.
రెండో దశ పోలింగ్ 45,399 కేంద్రాల్లో జరగనుంది. ఎన్డీఏలో బీజేపీ, జేడీ(యూ), హెచ్ఏఎంఎస్, ఎల్‌జేపీ (ఆర్‌వీ), ఇతర పార్టీలు కూటమిగా ఉన్నాయి. ఇది రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో కూడిన మహాఘటబంధన్, అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని చూస్తోంది. జన్ సూరాజ్ కూడా తన అవకాశాలపై ధీమాగా ఉంది.
బీహార్ ఎన్నికల తొలి దశ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పోలింగ్ శాతాన్ని నమోదు చేసింది. తొలి దశ పోలింగ్‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. జన్ సూరాజ్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు అధిక ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి.
బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని బద్గాం, నాగ్రోటా, రాజస్థాన్‌లోని అంటా, జార్ఖండ్‌లోని ఘట్‌శిల, తెలంగాణలోని జూబ్లీ హిల్స్, పంజాబ్‌లోని తరన్ తారన్, మిజోరంలోని డంపా, ఒడిశాలోని నువాపడ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి.