
Bihar Assembly Elections 2025 : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీహార్‌లోని అత్రి అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి రోమిత్ కుమార్ మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ జనతా దళ్ (RJD) - కాంగ్రెస్ కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీహార్ ఇప్పుడు లాంతరు మసక వెలుగులో కాకుండా ఎల్ఈడీ వెలుగులో ప్రకాశించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే బీహార్ యువతకు ఉపాధి లభిస్తుంది, నేరగాళ్లు జైలుకు వెళ్తారని చెప్పారు. అత్రిలో ఎన్డీయే అభ్యర్థి రోమిత్ కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించి బీహార్‌లో సుపరిపాలనకు బలమైన పునాది వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మహాత్ముడు గౌతమ బుద్ధుడికి జ్ఞానాన్ని ప్రసాదించిన, భగవాన్ మహావీరుడికి జన్మనిచ్చిన, దేశానికి తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ లాంటి మహానాయకులను అందించిన పవిత్ర భూమి బిహార్ అని యూపీ సీఎం యోగి కొనియాడారు. కానీ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఈ గౌరవప్రదమైన బీహార్‌ను గుర్తింపు సంక్షోభంలోకి నెట్టాయని విమర్శించారు.
నలంద విశ్వవిద్యాలయం, చాణక్యుడు, ఆర్యభట్టుల భూమిని ఆర్జేడీ-కాంగ్రెస్ చీకట్లోకి నెట్టాయని సీఎం యోగి అన్నారు. ఒకప్పుడు యావత్ ప్రపంచం నలందలో జ్ఞానం సంపాదించడానికి వచ్చేదని.. అక్కడ ఒకేసారి పదివేల మంది విద్యార్థులు చదువుకునేవారని గుర్తుచేశారు. కానీ ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనలో అదే బీహార్ అక్షరాస్యతలో అట్టడుగుకు చేరిందన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పుడు బీహార్ అక్షరాస్యత రేటు 33% ఉండగా ఇప్పుడు దాన్ని 75%కి పెంచామని తెలిపారు.
కాంగ్రెస్-ఆర్జేడీ పాలనలో సామూహిక హత్యలు, అపహరణలు, కుల ఘర్షణలు, అరాచక వాతావరణం ఉండేదని అన్నారు. 60 వేలకి పైగా సామూహిక హత్యలు, 30 వేలకు పైగా అపహరణలు జరిగాయన్నారు. వ్యాపారులు, ఆడపిల్లలు సురక్షితంగా లేని జంగిల్ రాజ్ రాష్ట్రాన్ని మార్చారు… వీళ్లు పేదల రేషన్, పశువుల దాణా రెండూ తినేశారని యోగి ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లో మాఫియా, నేరగాళ్లను తాము బుల్డోజర్‌తో అణచివేశామని సీఎం యోగి అన్నారు. ఇప్పుడు వారి ఎముకలు, పక్కటెముకలు ఒకటి అయ్యాయని చెప్పారు. యూపీలో నేరగాళ్లు కుదేలయ్యారు, యువత ఉత్సాహంగా ఉందన్నారు. బీహార్ కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలని, ఇక్కడ సుపరిపాలన, అభివృద్ధి ఉండాలి కానీ నేరాలు, అవినీతి కాదని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే బీహార్ యువతకు ఉపాధి లభిస్తుంది, నేరగాళ్లు జైలుకు వెళ్తారన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఈరోజు బలహీనమైన దేశం కాదు, బలమైన దేశంగా మారిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో తయారైన బ్రహ్మోస్ క్షిపణి ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌లో పడినప్పుడు ఆ దేశం వణికిపోయిందని చెప్పారు. భారత్ తమను నాశనం చేస్తుందని పాకిస్థాన్ వేడుకుందని అన్నారు. నేటి భారత్ ఎవరి బెదిరింపులనూ వినదని స్పష్టం చేశారు. ఎవరైనా భారత భద్రతకు భంగం కలిగిస్తే, భారత్ వారి ఇంట్లోకి చొరబడి చికిత్స చేస్తుందని హెచ్చరించారు. ఇది కొత్త భారత్— మోదీ గారి భారత్ అని అన్నారు.
వంశపారంపర్య మాఫియా, నేరగాళ్లకు ఓటు వేయడం బీహార్ భవిష్యత్తుకు అన్యాయం చేయడమేనని సీఎం యోగి ప్రజలకు పిలుపునిచ్చారు. బీహార్ భవిష్యత్తు కేవలం అభివృద్ధి రాజకీయాలతోనే సురక్షితంగా ఉంటుందని అన్నారు. ఎన్డీయే మాత్రమే యువతకు ఉద్యోగాలు ఇవ్వగలదు, నేరగాళ్లను జైలుకు పంపగలదు, పేదలకు గౌరవం ఇవ్వగలదు. ఇదే డబుల్ ఇంజిన్ శక్తి అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.