
Delhi Red Fort car bomb blast : దేశరాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో సోమవారం సాయంత్రం కారు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మందికిపైగా చనిపోయారు. 20 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. పలు వాహనాలు మంటల్లో చిక్కుకుని దెబ్బతిన్నాయని ఢిల్లీ అగ్నిమాపక విభాగం తెలిపింది. వెంటనే పోలీసులు, ఫైర్ సర్వీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పాయి. ప్రాంతాన్ని పూర్తిగా సురక్షితంగా చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పేలుడు ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. ఇది పర్యాటకులు, ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు చేసే ప్రదేశం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక ప్రజలను, మీడియా ప్రతినిధులను ఆ ప్రాంతం నుండి దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఫైర్ డిపార్ట్‌మెంట్ సమాచారం ప్రకారం, పేలుడు తర్వాత మంటలు వ్యాపించి మూడు నుంచి నాలుగు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కొన్ని వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంటలను నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
పేలుడు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రాంతాన్ని సీజ్ చేసి, మిగిలిన వాహనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పేలుడు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఎలాంటి ప్రాణనష్టం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ ఘటనను అధికారులు అత్యవసర స్థాయిలో పరిశీలిస్తున్నారు. పేలుడు కారణాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రాథమికంగా ప్రమాదం లేదా ఉద్దేశపూర్వక చర్య అనే కోణాల్లో విచారణ జరుగుతోంది. అధికారులు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.