
Bihar Assembly Election: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 కోసం భారతీయ జనతా పార్టీ (BJP) మంగళవారం తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 71 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో జరుగుతాయి, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది.
ఈ జాబితాలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు, మాజీ ఉపముఖ్యమంత్రులు, ప్రస్తుత మంత్రులు చోటు దక్కించుకున్నారు. అదే సమయంలో కొంతమంది సీనియర్ నేతలకు ఈసారి టికెట్లు దక్కకపోవడం గమనార్హం.
ఉపముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఈసారి ముంగేర్ జిల్లా తారాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. 2000, 2010లో ఖగారియా జిల్లాలోని పర్బట్టా నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆయన తల్లి పార్వతి దేవి, తండ్రి, మాజీ మంత్రి శకుని చౌదరి కూడా ప్రాతినిధ్యం వహించారు.
మరో ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సింహా లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రులు తారకీశోర్ ప్రసాద్ కతిహార్ నుండి, రేణు దేవి బెట్టియా శాసనసభ నియోజకవర్గం నుండి టికెట్లు పొందారు. రాష్ట్ర పారిశ్రామిక మంత్రిగా ఉన్న నితీశ్ మిశ్రా మధుబని జిల్లా ఝంఝర్‌పూర్ నుండి పోటీ చేయనున్నారు.
ఎన్డీయే కూటమిలో సీటు పంపకాలపై సోమవారం ఢిల్లీలో తుది నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ, జేడీయూ ఒక్కొక్కటి 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పస్వాన్ పార్టీకి 29 సీట్లు కేటాయించారు.
రాష్ట్రీయ లోక్ మోర్చా (ఉపేంద్ర కుశ్వాహా), హిందుస్థానీ అవామ్ మోర్చా (జితన్ రామ్ మాంఝీ) పార్టీలు తలా 6 సీట్లు పొందాయి. అయితే, తక్కువ సీట్లు ఇవ్వడంపై మాంఝీ, కుశ్వాహా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
బీజేపీ తొలి జాబితాలో ప్రముఖ నేతలు ఉన్నారు. వారిలో..
• రేణు దేవి - బెట్టియా
• తారకిశోర్ ప్రసాద్ - కతిహార్
• మంగళ్ పాండే - సివాన్
• రామ్ కృపాల్ యాదవ్ - దానాపూర్ నియోజకవర్గం
• నితిన్ నవీన్ - బంకీపూర్
• శ్రేయసి సింగ్ - జమూయ్
• అలోక్ రంజన్ ఝా - సహర్సా
• ప్రేమ్ కుమార్ - గయా
అసెంబ్లీ స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్ పేరు ఈసారి జాబితాలో ఉంటుందని భావించారు కానీ, లేదు. ఆయన స్థానంలో రత్నేష్ కుశ్వాహాకు పట్నా సాహిబ్ టికెట్ కేటాయించారు.
ఇటీవల పార్టీతో చేరిన భోజ్‌పురి నటుడు పవన్ సింగ్, సింగర్ మైతిలీ ఠాకూర్లకు టికెట్లు ఇవ్వలేదు. ఈ ఇద్దరిని ముందుగా ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం చేయాలని పార్టీ యోచించినా, అంతర్గత అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈసారి వారికి అవకాశం ఇవ్వలేదు.
టికెట్ రాకపోవడంపై నంద్ కిశోర్ యాదవ్ స్పందిస్తూ, “నేను నిరాశ చెందలేదు. కొత్త తరం నాయకులు ముందుకు రావాలి. పార్టీ, కార్యకర్తలు నన్ను ఎల్లప్పుడూ గౌరవించారు” అని తెలిపారు.
243 సీట్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి. ఎన్డీయే కూటమి ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ మొదటి జాబితా విడుదలతో బీహార్ రాజకీయాల్లో ఉత్సాహం, అంతర్గత అసంతృప్తి రెండూ కనిపిస్తున్నాయి. తర్వాతి జాబితాలో మరికొందరు కీలక నేతల పేర్లు వెలువడే అవకాశం ఉంది.