
Ayodhya Deepotsav 2025 : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో అయోధ్యలో దీపోత్సవం 2025 కోసం సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దీపోత్సవానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో అయోధ్య వీధుల్లో అద్భుతమైన అలంకరణ చేశారు. నగరం అంతటా దీపం ఆకారంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. ఇవి అయోధ్య అందాన్ని పెంచడమే కాకుండా, ఈ పవిత్ర నగరం ఆధ్యాత్మిక వైభవాన్ని కొత్త శిఖరాలకు చేర్చుతున్నాయి.
రామపథం, ధర్మపథం, జన్మభూమి పథం, హనుమాన్‌గఢీ మార్గం, సరయూ నది ఒడ్డున ఉన్న వీధుల్లో ఈ ప్రత్యేకమైన దీపాల లైట్ల వరుసలు దూరం నుంచే ఆకట్టుకుంటాయి. పగటిపూట వాటి కళాత్మక ఆకారాలు అందాన్ని వెదజల్లుతుంటే, సాయంత్రం కాగానే దీపమాలల్లా మినుకుమినుకుమంటాయి. దీంతో అయోధ్య నగరం పెళ్లికూతురిలా ముస్తాబైనట్లు కనిపిస్తుంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్, పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ కలిసి దీపోత్సవ సన్నాహాలను పూర్తి చేస్తున్నాయి. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా "ప్రపంచ రికార్డు" సృష్టించడంతో పాటు అయోధ్య సంప్రదాయం, గౌరవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నగరం ప్రవేశ ద్వారాల నుంచి రామ్ కీ పైడీ వరకు ఏర్పాటు చేసిన ఈ లైట్లు వాతావరణాన్ని పండుగలా మార్చేశాయి. సాయంత్రం వేళ ఈ దీపాల ఆకారంలో ఉన్న లైట్లు వెలిగినప్పుడు సాక్షాత్తు శ్రీరాముడే నగరంలో దివ్యమైన కాంతిని వెదజల్లుతున్నట్లు అనిపిస్తుంది.
అయోధ్య మున్సిపల్ కమిషనర్ జయేంద్ర కుమార్ ప్రకారం… ఈసారి థీమ్ 'అయోధ్య కాంతి, భక్తి నగరం'గా పెట్టారు. అక్కడక్కడా ఏర్పాటు చేసిన ప్రత్యేక LED దీపాలు, థీమాటిక్ లైట్లు నగరాన్ని మొత్తం ఒకే భావనతో కలుపుతున్నాయి. ఇలా రామనామ స్మరణ, భక్తి జ్యోతితో వెలిగిపోతోంది అయోధ్య.