ఇప్పటికే పీకే స్పీడు, రంగంలోకి దీదీ.. సోనియా సహా విపక్షనేతలతో భేటీకానున్న మమత

By Siva KodatiFirst Published Jul 15, 2021, 4:57 PM IST
Highlights

ఈ నెల 25న బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే సోనియాతో సహా విపక్ష నేతలందర్నీ మమత కలవాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం
 

బీజేపీ దూకుడుకు కళ్లెంవేసి బెంగాల్‌లో మూడోసారి అధికారంలోకి వచ్చారు మమతా బెనర్జీ. సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి భారతీయ జనతా పార్టీకి షాకులు ఇస్తూ.. దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమె మరో అడుగు వేయనున్నారు. దేశంలోని విపక్ష నేతలందరితో ఆమె భేటీ కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత పవార్, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్, సీఎం కేజ్రీవాల్‌తో సహా పలువురు ప్రతిపక్ష నేతలను దీదీ కలుసుకోనున్నారు.

తొలుత ఈ నెల 25న మమత ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నెల 19 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే సోనియాతో సహా విపక్ష నేతలందర్నీ మమత కలవాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. పరోక్షంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఈ సందర్భం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read:పీకే భేటీతో మారుతున్న రాజకీయం .. ఏఐసీసీలో కదలిక, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కమల్‌నాథ్..?

అధికార బీజేపీని సభలో ఇరుకున పెట్టడానికి మమతా బెనర్జీ సాయం తీసుకోవాలని, ఇందుకు వ్యూహాం కూడా సిద్ధం చేయాలని సోనియా యోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా అధీర్ రంజన్ కొనసాగుతున్నారు. అధీర్ రంజన్‌కు తృణమూల్ అంటే అరికాళ్లలో మంట నషాళానికి అంటుతుంది. ఆ పార్టీ పేరు వింటేనే ఆయన ఒంటికాలిపై లేస్తుంటారు. అధీర్ ఇలాగే కొనసాగితే, మమతతో చేతులు కలపడం అసాధ్యమని సోనియా గాంధీ భావన. అందుకే పార్లమెంట్ సమావేశాల ముందు అధీర్ రంజన్‌ స్థానంలో వేరొకరిని కాంగ్రెస్ పక్షనేతగా నియమించాలని సోనియా నిర్ణయించారు.

శశిథరూర్, మనీశ్ తివారీతో సహా పలువురు ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. చివరికి రాహుల్ గాంధీవైపు సోనియా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రాహుల్ ఆ బాధ్యతలు తీసుకుంటే, మమతతో జతకట్టడం సులభమన్నది సోనియా ఆలోచన. మరోవైపు బీజేపీ కూడా రాజ్యసభ పక్షనేతగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష కూటమిని ఏర్పాటు చేయాలని ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన పలువురు నేతలను కూడా కలిశారు. వీరిలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ కూడా వున్నారు. తాజాగా ఇప్పుడు దీదీ కూడా విపక్షనేతలను కలుస్తుండటంతో ఆమె కూడా 2024 ఎన్నికలపై కన్నేశారా అని కొందరు వాదిస్తున్నారు. 

click me!