గత ఐదేళ్లలో రూ. 10 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిల రైటాఫ్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

By Sumanth KanukulaFirst Published Dec 13, 2022, 5:17 PM IST
Highlights

గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో బ్యాంకులు 10,09,511 కోట్ల రూపాయల మొండి బకాయిలను రైటాఫ్ చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు తెలియజేశారు.

గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో బ్యాంకులు 10,09,511 కోట్ల రూపాయల మొండి బకాయిలను రైటాఫ్ చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు తెలియజేశారు. నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) లేదా మొండి బకాయిలను రైటాఫ్ ద్వారా సంబంధిత బ్యాంకులు వాటిని బ్యాలెన్స్ షీట్ నుంచి తీసివేస్తాయని చెప్పారు. రాజ్యసభలో ఓ సభ్యుని ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ ఈ వివరాలను వెల్లడించారు. 

‘‘బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌ను క్లీన్ చేయడానికి, పన్ను ప్రయోజనాలను పొందేందుకు, మూలధనాన్ని ఆప్టిమైజ్ చేయడానికి వారి రెగ్యులర్ కసరత్తులో భాగంగా.. ఆర్‌బీఐ మార్గదర్శకాలు, వారి బోర్డులచే ఆమోదించబడిన విధానానికి అనుగుణంగా ఎన్‌‌పీఏలను రద్దు చేస్తాయి. ఆర్‌బీఐ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం..షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ఎస్‌సీబీ) గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 10,09,511 కోట్ల మొత్తాన్ని రైటాఫ్ చేశాయి’’ అని ఆమె చెప్పారు.

రైటాఫ్ చేసినప్పటికీ రుణగ్రహీత వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రుణగ్రహీత నుంచి బకాయిల రికవరీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. బకాయిల రికవరీ ప్రక్రియ కొనసాగుతున్నందున.. రైటాఫ్ రుణగ్రహీతకు ప్రయోజనం కలిగించదని అన్నారు. సివిల్ కోర్టులు లేదా రుణాల రికవరీ ట్రిబ్యునళ్లలో దావా దాఖలు చేయడం, దివాలా దివాలా కోడ్, 2016 కింద కేసులు దాఖలు చేయడం, నిరర్థక ఆస్తుల విక్రయం వంటి అందుబాటులో ఉన్న వివిధ రికవరీ మెకానిజమ్‌ల ద్వారా బ్యాంకులు రైటాఫ్ మొత్తాన్ని రికవరీ చేస్తూనే ఉన్నాయని తెలిపారు. 

గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రైటాఫ్ లోన్ ఖాతాల నుంచి రూ. 1,32,036 కోట్ల రికవరీ సహా..  మొత్తం రూ. 6,59,596 కోట్లను ఎస్‌సీబీలు రికవరీ చేశాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అందిన ఇన్‌పుట్‌ల ప్రకారం.. గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో 3,312 మంది బ్యాంకు అధికారులపై (ఏజీఎం, అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నవారు) ఎన్‌పీఏ కేసులకు సంబంధించి సిబ్బంది జవాబుదారీతనం నిర్దారించబడిందని తెలిపారు. వారిపై తగిన చర్యలు తీసుకున్నట్లు ఆమె చెప్పారు.

ఇక, నిర్మలా సీతారామన్ మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని కొంతమేర ఉపయోగిస్తున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలియజేసినట్లు చెప్పారు.

click me!