కేవలం శాఖాహార వంటకాలను అందించే దేశంలోనే మొట్టమొదట ఏడు నక్షత్రాల హోటల్‌ను అయోధ్యలో ప్రారంభించారు. మరోవైపు.. సరయూ నది ఒడ్డున భారీగా ఫైవ్ స్టార్ హోటళ్లు నిర్మితం కానున్నాయి.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో .. శ్రీరాముడితో పాటు అయోధ్యా నగరం కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది. భారతీయులకు ఈ నగరంతో వున్న అనుబంధం సామాన్యమైనది కాదు. రాములోరి జన్మభూమిగా ఈ సిటీ సుపరిచితం. తాజా వేడుక నేపథ్యంలో అయోధ్య గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీరాముడిని దర్శించుకోవడానికి వచ్చే వారి కోసం అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విశాలమైన రోడ్లు, పారిశుద్ధ్యం , భద్రత, సుందరీకరణ, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టు ఆధునీకీకరణతో అయోధ్య సరికొత్తగా కనిపిస్తోంది.
ఇదిలావుండగా.. కేవలం శాఖాహార వంటకాలను అందించే దేశంలోనే మొట్టమొదట ఏడు నక్షత్రాల హోటల్‌ను అయోధ్యలో ప్రారంభించారు. ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంసెనీ కూడా అయోధ్యలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించాలని యోచిస్తోంది. జనవరి 22న ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి హౌసింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు.
హోటళ్లు, గృహ సముదాయాల నిర్మాణంతో సహా నగరాన్ని ప్రధాన కేంద్రంగా మార్చడానికి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నగరం నుంచి ఇప్పటికే ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాలకు విమాన సౌకర్యంతో పాటు పునర్నిర్మించిన రైల్వేస్టేషన్‌లకు తోడు.. లక్నో నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ సర్వీస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
మరోవైపు.. సరయూ నది ఒడ్డున భారీగా ఫైవ్ స్టార్ హోటళ్లు నిర్మితం కానున్నాయి. 110 వరకు చిన్నా పెద్దా హోటళ్లను నిర్మించేందుకు పలు సంస్థలు భూములను కొనుగోలు చేస్తున్నాయి. అలాగే సోలార్ పార్క్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం ఆలయం నుంచి 15 నిమిషాల దూరంలో వున్న లగ్జరీ ఎక్స్‌క్లేవ్ ‘‘ ది సరయూ’’లో భూమిని కొనుగోలు చేసినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.