
Boat Capsizes In Vadodara : గుజరాత్ లోని వడోదరలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. హరానీ సరస్సులో పడవ బోల్తా పడటంతో 9 మంది చిన్నారులు. ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 24 మంది పిల్లలు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ టీం సరస్సు నుంచి ఐదుగురు చిన్నారులను రక్షించిందని ‘ఇండియా టీవీ’ పేర్కొంది.
కాగా.. ఈ దుర్ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడోదరలోని హరానీ సరస్సులో పడవ మునిగి చిన్నారులు మునిగిపోయిన ఘటన హృదయవిదారకంగా ఉందని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన అమాయక చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
భగవంతుడు బాధిత కుటుంబాలకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని కోరారు. బోటులో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాద బాధితులకు తక్షణ ఉపశమనం, చికిత్స అందించాలని అధికారులను ఆదేశించామని ఆయన తన ‘ఎక్స్’(ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే.. ?
వడోదర నగరానికి చెందిన విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి హరానీ సరస్సు వద్దకు విహార యాత్రకు వచ్చారు. అందులో భాగంగా 27 మంది విద్యార్థులతో వెళ్తున్న సరస్సులో ప్రయానిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), అగ్నిమాపక సిబ్బందితో పాటు ఇతర ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనలో 9 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించారు.
మిగిలిన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పడవలో 27 మంది చిన్నారులు ఉన్నారని వడోదర జిల్లా కలెక్టర్ ఏబీ గోర్ తెలిపారు. ఇతరుల ఆచూకీ కనుగొని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థులను రక్షించారని, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోందని వడోదర చీఫ్ ఫైర్ ఆఫీసర్ పార్థ్ బ్రహ్మభట్ తెలిపారు. కాగా.. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే కొందరు స్థానికులు కొందరు చిన్నారులను రక్షించారు.