అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి శ్రీరాముడిపై భక్తుని చాటుకున్నారు. ఏకంగా 20 కేజీల పార్లే జీ బిస్కెట్లతో అయోధ్యలోని రామమందిరం నమూనాని చెక్కాడు.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రామ నామ స్మరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి శ్రీరాముడిపై భక్తుని చాటుకున్నారు. ఏకంగా 20 కేజీల పార్లే జీ బిస్కెట్లతో అయోధ్యలోని రామమందిరం నమూనాని చెక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్ పేజీ "durgapur_times,"లో షేర్ చేసిన వీడియలో సదరు వ్యక్తి పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్లను ఓపెన్ చేసి వాటిని ఖచ్చితమైన స్థానంలో అమర్చి అయోధ్యలోని రామ మందిర ఆలయాన్ని తీర్చిదిద్దాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 5.8 మిలియన్ల మంది లైక్ చేశారు. కళాకారుడి ప్రతిభావంతమైన చేతులు రామమందిర సూక్ష్మ రూపానికి జీవం పోశాయని నెటిజన్లు ప్రశంసించారు.
జనవరి 22న జరగనున్న చారిత్రాత్మక రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఈ వీడియో ప్రజాదరణ పొందింది. దాదాపు 500 ఏళ్ల నిరీక్షణకు పరాకాష్టగా నిలిచిన ఈ మహత్తర వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. 57,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైన రామమందిరం 300 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో వుంది.
ఇకపోతే.. అయోధ్య రామ మందిర ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి గురువారం కీలక ఘట్టం పూర్తయ్యింది. అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఐదేళ్ల బాల రాముడి 51 అంగుళాల పొడవైన నల్లరాతి విగ్రహాన్ని నాలుగు గంటల పూజలు, వేద మంత్రాల నడుమ ప్రతిష్టించారు. రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ధర్మకర్త బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా పర్యవేక్షణలో ఈ విగ్రహాన్ని ఎంపిక చేశారు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో 121 మంది పూజారులు పాల్గొన్నట్లు పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని గర్భగుడిలో వాస్తు పూజ కూడా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.