అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయి ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారయ్యింది. ఈ నేపథ్యంలో రాములోరిని దర్శించుకోవడమే కాదు హారతిలో పాల్గొనే అవకాశాన్ని భక్తులకు కల్సిస్తోంది ఆలయ ట్రస్ట్,
Ayodhya Ram Mandir : హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో భవ్యమైన రామమందిరం అతి త్వరలో ప్రారంభంకానుంది. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశ ప్రజల భాగస్వామ్యంతో రాములోరి కోవెలను అద్భుతంగా నిర్మించింది. ఇప్పటికే రామయ్య కొలువైవుండే గర్భగుడి నిర్మాణం పూర్తయ్యింది. దీంతో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 22, 2024 లో అయోధ్య రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ 'ప్రాణప్రతిష్ట' వేడుక కోసమే రామభక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నది... ఆ కోరిక మరికొద్దిరోజుల్లో నెరవేరి రామయ్య భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
అయోధ్య రామందిరాన్ని ప్రారంభించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. అయితే రామయ్య దర్శనంకోసం వచ్చే భక్తులకు ఉదయం 7 గంటల నుండి ఆలయంలోకి అనుమతించనున్నారు. ఇలా 11.30 గంటలవరకు భక్తులకు రామయ్య దర్శనాన్ని కల్పించనున్నారు. ఆ తర్వాత రెండున్నర గంటలు ఆలయాన్ని గర్భగుడిని మూసివేసి తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తెరవనున్నారు. అప్పటినుండి రాత్రి 7 గంటల వరకు భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. రాత్రి సమయంలో అయోధ్య ఆలయం మూసివుండనుంది.
undefined
ఇక కేవలం దర్శనం మాత్రమే కాదు రామయ్య హారతిలో పాల్గొనే అవకాశాన్ని కూడా అయోధ్య ఆలయ ట్రస్ట్ భక్తులకు కల్పించింది. ఉదయమే స్వామివారిని మెలుకొలిపి 6.30 గంటలకు హారతి ఇవ్వనునన్నారు. ఇందులో పాల్గొనాలంటే భక్తులు ముందురోజే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి వుంటుంది. పరిమిత సంఖ్యలో భక్తులకు మాత్రమే హారతిలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఇక రాత్రి 7 గంటలకు దర్శనం నిలిపివేసాక 7.30 కి సంధ్యాహారతి నిర్వహించనున్నారు. ఇందుకోసం అదేరోజు బుకింగ్ సదుపాయం వుంటుందని ఆలయ ట్రస్ట్ ప్రకటిచింది. హారతి కోసం బుకింగ్ చేసుకున్న వారు అరగంట ముందుగానే మందిర క్యాంప్ కార్యాలయానికి చేరుకోవాలని...ఏదయినా గుర్తింపుకార్డు చూపిస్తూ పాసులు అందిస్తారు... వాటిని తీసుకువెళ్ళి హారతి కార్యక్రమంలో పాల్గొని తరించవచ్చు.
Also Read భక్తులారా... రామమందిర ప్రారంభోత్సవానికి రాకండి..: అయోధ్య ఆలయ ట్రస్ట్ కార్యదర్శి సంచలనం
ఇదిలావుంటే అయోధ్య రామమందిరాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు వారంరోజుల ముందే ప్రారంభంకానున్నాయి. జనవరి 22 నుండి వారణాసికి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో రామమందిరంలో పూజలు ప్రారంభంకానున్నాయి. వారం రోజుల పాటు నిర్విరామంగా పూజలు చేసి రాముడి విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు.
రామమందిర నిర్మాణమే కాదు ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలిరానున్నారు. ఇందుకు తగినట్లుగా ఆలయ ట్రస్ట్, యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్యలో చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తుల వసతి కోసం తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆలయ ప్రారంభోత్సవం కోసం వచ్చే ప్రధాని, ఇతర ప్రముఖుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.