మహారాష్ట్ర నాగ్‌పూర్ లోని సోలార్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ఇవాళ జరిగిన పేలుడు చోటు చేసుకుంది.ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
ముంబై: మహారాష్ట్ర నాగ్‌పూర్ లోని సోలార్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ఆదివారంనాడు జరిగిన పేలుడులో 9 మంది మృతి చెందారు.నాగ్ పూర్ బజార్ గావ్ గ్రామంలోని సోలార్ ఇండస్ట్రీస్ లో పేలుడు జరిగింది. ఇవాళ ఉదయం కంపెనీలోని కాస్ట్ బూస్టర్ యూనిట్ లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా పోలీసులు తెలిపారు.మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. ప్రమాదస్థలిని అధికారులు పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాాను ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నాగ్ పూర్ కలెక్టర్ డాక్టర్ విపిన్ ఇటాంకర్, నాగ్ పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.