Assembly election 2022: అసెంబ్లీ ఎన్నిక‌లు.. ఆరోగ్య శాఖతో ఈసీ స‌మావేశం ! కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం

By Mahesh RajamoniFirst Published Jan 22, 2022, 12:22 AM IST
Highlights

Assembly election 2022: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే నెల‌లో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఎన్నిక‌ల ర్యాలీలు, రోడ్‌షోల‌కు సంబంధించి నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల‌ను గురించి తెలుసుకోవ‌డానికి ఈసీ.. కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారుల‌తో శ‌నివారం నాడు వర్చువల్ గా సమావేశం కానుంది. 
 

Assembly election 2022: క‌రోనా మ‌హ‌మ్మారి (Coronavirus) విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పాటు డెల్టా వేరియంట్ల వ్యాప్తి అధికం కావ‌డంతో నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. కోవిడ్‌-19 (Coronavirus) మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. అయితే, క‌రోనా వైర‌స్ థ‌ర్ఢ్ వేవ్ ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నిక‌ల సంఘం (Election Commission of India).. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ముందుకు సాగ‌డంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సంబంధించి  ఈసీ షెడ్యూల్ విడుద‌ల చేసిన‌ప్ప‌టికీ.. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని దృష్టి ఉంచుకుని ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌లు, స‌మావేశాల‌పై ప‌లు ఆంక్ష‌లు విధించింది. 

కాగా, ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్ర‌స్తుత క‌రోనా వైర‌స్  ప‌రిస్థితుల గురించి తెలుసుకోవ‌డానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, ఐదు రాష్ట్రాల ప్రధాన ఆరోగ్య కార్యదర్శులతో భారత ఎన్నికల సంఘం (Election Commission of India) శనివారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ స‌మావేశంలో ఎన్నికల రోడ్ షోలు, ర్యాలీలపై EC నిషేధం గురించి సమీక్షా  నిర్వ‌హించ‌నున్నారు. అలాగే, క‌రోనా వైర‌స్ (Coronavirus) వ్యాప్తి, ప్ర‌స్తుత ప‌రిస్థితులు గురంచి ఎన్నిక‌ల సంఘం.. ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించ‌నుంది.  కాగా, దేశంలో కోవిడ్-19 కేసులు నిరంతరం పెరుగుతుండటంతో, ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం విధించింది. అయితే, ఈ ఆంక్ష‌ల సడలింపులను అనుమతించడంలో టీకాల పురోగతి కీలక అంశంగా మార‌నుంది. ఆయా వ‌చ్చే నెల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే మణిపూర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఐదు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్‌, టీకాల ప‌రిస్థితుల‌పై ఈసీ ఆరా తీయ‌నుంది.

ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాలలో ఎన్నికలకు ముందు గరిష్టంగా ఓటర్లకు టీకాలు వేయడమే ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. ప్ర‌స్తుతం 98,238 క్రియాశీల కోవిడ్-19 (Coronavirus) కేసులను కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్.. దాని జనాభాలో 96 శాతం మందికి టీకాలు వేసింది. అందులో 18 ప్లస్ కేటగిరీకి చెందిన వారు కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్ తన జనాభాలో 99 శాతం మందికి COVID-19 వ్యాక్సిన్ మొదటి డోస్‌, 84 శాతం జనాభాకు రెండు డోసుల కరోనా టీకాలు వేసింది. ఫిబ్ర‌వ‌రిలో అసెంబ్లీ ఎన్నిక‌ల జ‌ర‌నున్న మ‌రో రాష్ట్రం గోవా తన జనాభాలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 98 శాతం మందికి COVID-19 రెండు డోసుల టీకాలు వేసింది. 

అంతకుముందు, భారత ఎన్నికల సంఘం ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో రోడ్‌షోలు, ర్యాలీలపై నిషేధాన్ని జనవరి 22 వరకు పొడిగించింది. అయితే, 300 మంది వ్యక్తులతో లేదా హాల్ సీటింగ్ సామర్థ్యంలో 50% రాజకీయ పార్టీల ఇండోర్ సమావేశాలకు అనుమతినిచ్చింది. గతంలో జరిగిన సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనుప్ చంద్ర పాండే,  సెక్రటరీ జనరల్, సంబంధిత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లతో కలిసి కోవిడ్ స్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, 117 నియోజకవర్గాలున్న పంజాబ్‌లో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా ఫిబ్రవరి 20న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలు, గోవాలో 40 స్థానాలు ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. 60 స్థానాలున్న మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న అన్ని అసెంబ్లీ స్థానాలకు (Assembly election 2022) ఓట్ల లెక్కింపు జరగనుంది.

click me!