
అసోంలోని నల్బరి జిల్లాలో ఓ గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒకే ఒక్క కుటుంబం నివసిస్తున్నది. ఒకప్పుడు పంటలతో సుభిక్షంగా తులతూగిన ఆ గ్రామం ఇప్పుడు మనుషుల్లేని ఎడారిని తలపిస్తున్నది. శతాబ్దాల క్రితం ఎటు చూసిన మందే ఉండేవారు. ఎటు చూసినా పంట పొలాల్లే అన్నట్టుగా ఉండేది. కానీ, ఏళ్లు గడుస్తున్నా కొద్దీ ఒక్కొక్కరు ఊరి విడిచి వెళ్లిపోయారు. వెళ్లినవారు తిరిగి రాలేదు. చివరకు అక్కడ ఇప్పుడు ఒకే ఒక కుటుంబం నివసిస్తున్నది. నల్బరి పట్టణం గోగ్రాపారా సర్కిల్‌లోని ఆ ఊరి పేరు.. నెంబర్ 2 బర్దనారా.
2011 జనాభా లెక్కల ప్రకారం ఆ గ్రామంలో 16 మంది ఉన్నారు. ఇప్పుడు బిమల్ దేకా కుటుంబం మాత్రమే ఉన్నది. బిమల్ దేకా, ఆయన భార్య యానిమా. వారికి ముగ్గురు పిల్లలు నరేన్, దీపాలి, సియుతిలు ఉన్నారు. ఈ ఐదుగురే ఇప్పుడు గ్రామంలో ఉన్నది. ఆ ఊరికి సరైన దారి లేదు. వర్షాలు కురిస్తే చుట్టూ నీరే చేరుతుంది. అప్పుడు బయటికి వెళ్లాలంటే వారు తయారు చేసుకున్న ఒక చిన్న బోటు సహాయంతో నీటిపై ప్రయాణిస్తున్నారు. మిగిలిన కాలంలోనూ అంతా చిత్తడి నేలే. కనీసం 2 కిలోమీటర్లు నడిచి వెళ్లితేగానీ వాహనాలు వెళ్లడానికి అనువైన దారి కానరాదని దీపాలి తెలిపారు.
తమ పిల్లలను ఆ బోటులోనే యానిమా తీసుకెళ్లి తీసుకువస్తుంది. ఇన్ని కష్టాలున్నా.. ఆ దంపతులు మాత్రం తమ పిల్లలకు సరైన విద్యను అందించడంలో రాజీ పడలేదు. దీపాలి, నరేన్‌లు గ్రాడ్యుయేట్లు. సియుతి తన హైయర్ సెకండరీ చదువుతున్నది.
ఎలక్ట్రిసిటీ లేని కారణంగా కిరోసిన్ దీపాల కిందే వారు చదువుకుంటారు.
Also Read: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ పరీక్షలో చీటింగ్.. హర్యానా నుంచి ముగ్గురు అరెస్టు
వరదలతో నిర్మానుష్యంగా మారిపోయిన ఈ గ్రామం 162 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నది. కొన్ని దశాబ్దాల క్రితమైనా మరీ ఇంతటి దయానీయంగా ఏమీ లేదు. మాజీ సీఎం బిష్ణురామ్ మేధి నెంబర్ 2 బర్దనారాను కొన్ని దశాబ్దాల క్రితం పర్యటించారు. ఈ గ్రామానికి ఓ రోడ్డును ప్రారంభించారు. కానీ, పరిస్థితులు మారలేదు. స్థానిక ఉద్యోగులు ఉదాసీనంతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయని, వారు ఏ పనీ పూర్తి చేయలేదని యానిమా చెప్పారు. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, బ్లాక్ అభివృద్ధి అధికారులు ఇక్కడ అభివృద్ధి పనులు చేయించడానికి ఆసక్తి చూపలేదని వివరించారు. ఇక్కడ సాగు, పశువుల పెంపకం తప్పితే మరే పని లేకుండా పరిస్థితులు మారిపోయాయి.
వరుస వరదల కారణంగా ఈ గ్రామం యేటికేడు దిగజారిపోయింది.
ఇటీవలే గ్రామ్య వికాశ్ మంచా అనే ఓ ఎన్జీవో ఇక్కడికి వచ్చింది. అగ్రికల్చర్ ఫామ్ ఒకటి ప్రారంభించింది. దీంతో బిమల్ దేకా కుటుంబం మాట్లాడుకోవడానికి కొందరైనా దొరికారు. ఈ ఫామ్స్ చైర్మన్ ప్రీతి భూసన్ దేకా మాట్లాడుతూ.. రోడ్లు నిర్మించి, ప్రాథమిక వసతులు కల్పిస్తే ఇక్కడ సాగు చేయడానికి అనుకూలతలు పుష్కలంగా ఉన్నాయని, కాబట్టి, ప్రజలు మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు బోలెడు ఉన్నాయని తెలిపారు.