హిందుత్వం ప్రతీ చోటుకు అవసరం లేదు.. చంద్రయాన్-3 దిగిన ప్రాంతాన్ని ‘విక్రమ్ సారాబాయ్’ అని పిలవాలి - సంజయ్ రౌత్

Published : Aug 27, 2023, 01:13 PM IST
హిందుత్వం ప్రతీ చోటుకు అవసరం లేదు.. చంద్రయాన్-3 దిగిన ప్రాంతాన్ని ‘విక్రమ్ సారాబాయ్’ అని పిలవాలి -  సంజయ్ రౌత్

సారాంశం

చంద్రయాన్ -3 చంద్రుడిపై కాలుమోపిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని ప్రధాని మోడీ పేరు పెట్టడం పట్ల శివసేన (యూబీటీ) నాయకుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతీ చోటుకు హిందుత్వాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. విక్రమ్ దిగిన ప్రాంతానికి విక్రమ్ సారాబాయ్ అని పేరు పెట్టాలని సూచించారు. 

చంద్రయాన్-3 మిషన్ చంద్రుడిపై కాలుమోపిన ప్రదేశానికి విక్రమ్ సారాభాయ్ లేదా జవహార్ లాల్ నెహ్రూ అని పేరు పెట్టాల్సిందని శివసేన (యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఆ ఇద్దరి కృషి వల్లే ఇస్రో ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉందని అన్నారు. ఆగస్టు 23వ తేదీన విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని ‘శివశక్తి’ పాయింట్ గా, 2019లో చంద్రయాన్ -2లోని విక్రమ్ చంద్రుడిపై కుప్పకూలిన ప్రాంతాన్ని ‘తిరంగా పాయింట్’ పాయింట్ గా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘బీజేపీ ఇంకేం చేయగలదు? చంద్రయాన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రదేశానికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టాలని నేను భావిస్తున్నాను. సారాభాయ్, పండిట్ నెహ్రూల గొప్ప కృషి వల్లే ఇది సాధ్యమైంది’’ అని అన్నారు.  అన్ని చోట్లా హిందుత్వాన్ని తీసుకురావడం సరికాదని ఆయన అన్నారు. ఇస్రో కోసం నెహ్రూ ఎంతో కృషి చేశారని, ఆయనను, శాస్త్రవేత్తలను మరిచిపోయి ఎక్కడికక్కడ హిందుత్వాన్ని తీసుకొస్తున్నారని విమర్శించారు.

‘‘మేము కూడా హిందుత్వాన్ని విశ్వసిస్తాం. కానీ కొన్ని విషయాలు సైన్స్ కు సంబంధించినవని. అన్ని చోట్లకు హిందుత్వాన్ని తీసుకురావడం సరైనది కాదు. ఇది వీర్ సావర్కర్ చెప్పారు’’ అని సంజయ్ రౌత్ అన్నారు. 

చంద్రయాన్ -3 విజయవంతమైన నేపథ్యంలో శాస్త్రవేత్తలను అభినందించడానికి రెండు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ శనివారం నేరుగా కర్ణాటకకు చేరుకున్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్లి శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకున్నారు. సోమనాథ్ వెన్ను తట్టి ఘన విజయం సాధించినందుకు అభినందించారు.  శాస్త్రవేత్తలకు సెల్యూట్ చెబుతూ.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ సందర్భంగా చంద్రయాన్-3 చంద్రుడిని తాకిన ప్రదేశానికి 'శివశక్తి పాయింట్'గా, 2019లో చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 కూలిన ప్రదేశానికి 'తిరంగా పాయింట్' అని నామకరణం చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే, చంద్రయాన్ -3 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగిన రోజు ఆగస్టు 23 ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటామని ప్రధాని మోడీ తెలిపారు. కాగా.. అంతకు ముందు 2008 నవంబర్ 14న జరిగిన చంద్రయాన్-1లోని మూన్ ఇంపాక్టర్ ప్రోబ్ క్రాష్ ల్యాండింగ్ పాయింట్ కు 'జవహర్ స్థల్' లేదా ‘జవహర్ పాయింట్’ అని నామకరణం చేశారు.

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?