పాకిస్తాన్‌కు అమెరికా నుంచి ఫైటర్ జెట్ ఎక్విప్‌మెంట్లు.. ‘సహాయం కాదు.. విక్రయమే’

By Mahesh KFirst Published Sep 10, 2022, 12:45 AM IST
Highlights

అమెరికా నుంచి పాకిస్తాన్‌కు ఎఫ్-16 విమానాల ఎక్విప్‌మెంట్లు వెళ్లనున్నాయి. ఈ 450 మిలియన్ డాలర్ల ప్రోగ్రామ్‌పై భారత్ సీరియస్‌గా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇది కేవలం విక్రయం మాత్రమేనని, సహాయం కాదని అమెరికా తెలిపింది. ఈ ప్రోగ్రామ్‌లో తాము పాకిస్తాన్‌‌కు కొత్త యుద్ధ విమానాలు, కొత్త సామర్థ్యాలు, కొత్త ఆయుధ వ్యవస్థలను పంపించడం లేదని, కేవలం స్పేర్ పార్ట్స్, మెయింటెనెన్స్ మాత్రమే అందిస్తున్నామని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ కోసం 450 మిలియన్ డాలర్ల ప్రోగ్రామ్2కు ఆమోద ముద్ర వేసింది. పాకిస్తాన్‌కు సెక్యూరిటీ పరమైన సహకారం అందివ్వరాదని, ఉగ్రవాదుల ఏరివేతలో పాకిస్తాన్ సమర్థంగా వ్యవహరించడం లేదని ట్రంప్ ఉన్నప్పుడు ఓ ఆదేశం తెచ్చాడు. ఆ ఆదేశాలను తిరగేస్తూ.. పాకిస్తాన్‌కు సెక్యూరిటీ సహకారం అందివ్వడానికి అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీని పై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మధ్యాసియా, దక్షిణాసియా వ్యవహారాల రక్షణ శాఖ సహాయ మంత్రి డొనాల్డ్ లూ ఇండియా టుడేతో మాట్లాడారు.

అమెరికా అమ్మిన ప్రతి ఆయుధాలు లేదా యుద్ధ విమానాల మనుగడకు అవసరమైన సహకారం ఆ దేశానికి చివరి వరకూ అందించడం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అనుసరిస్తూ విధానం అని ఆయన వివరించారు. పాకిస్తాన్ విషయానికి వస్తే. ఇది కేవలం స్పేర్ పార్ట్స్, మెయింటెనెన్స్‌కు సంబంధించిన అంశమే అని స్పష్టం చేశారు. ఇది కేవలం విక్రయం మాత్రమేనని, సహాయం కాదని ఆయన వివరించారు.

పాకిస్తాన్‌కు తాము అమ్మిన ఎఫ్-16 యుద్ధ విమానాల సర్వీసింగ్, మెయింటెనెన్స్, కొన్ని పార్ట్‌లను తొలగించి మళ్లీ కొత్త పార్ట్‌లు వేసే పనిలో ఉన్నామని వివరించారు. ఈ యుద్ధ విమానాలు చాలా పాతవని (సుమారు 40 ఏళ్ల కిందటి యుద్ధ విమానాలు) తెలిపారు. కాబట్టి, ఆ దేశ పైలట్లు, ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా ఈ పని చేయడం అనివార్యం అని చెప్పారు. ఎయిర్ సేఫ్టీ స్టాండర్డ్ కోసం అవసరమైన పార్ట్స్‌ను అక్కడకు పంపించామని, కానీ, కొత్త విమానాలు, కొత్త సామర్థ్యాలను, కొత్త ఆయుధ వ్యవస్థలను పాకిస్తాన్‌ కు పంపలేదని విస్పష్టం చేశారు.

తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్ ఉగ్రవాద సంస్థలను, వాటి ఆశ్రయాలను దేశంలో లేకుండా చేయడంలో పాకిస్తాన్‌ అలసత్వంగా వ్యవహరించిందని 2018లో అప్పటి ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. అందుకే ఆ దేశానికి 2 బిలియన్ డాలర్ల సెక్యూరిటీ సహకారాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. ఇది దోహా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని అమెరికా భావించింది.

click me!