
పిల్లలకు కోవిడ్ - 19 వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ‘అశాస్త్రీయత’ నిర్ణయం నిరాశపర్చిందని ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కె రాయ్ అన్నారు. ఆయన ఎయిమ్స్‌లో పెద్దవారిపై, చిన్నారులపై నిర్వహిస్తున్నకోవాగ్జిన్ ట్రయల్స్ ప్రధాన పరిశోధకుడిగా పని చేస్తున్నారు. దీంతో పాటు ఆయన ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు జనవరి 3వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. ప్రధాని చేసిన ఈ ప్రకటనపై ఎపిడెమియాలజిస్ట్ సంజయ్ కె రాయ్ స్పందించారు. ప్రధానమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో ఎలాంటి అదనపు ప్రయోజనమూ చేకూరదని చెప్పారు. పిల్లలకు టీకాలు ఇచ్చే ముందు ఇప్పటికే పిల్లలకు టీకాలు వేస్తున్న ఇతర దేశాల డేటాను తప్పనిసరిగా విశ్లేషించాలని అన్నారు. దీని వల్ల పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆందోళనలు తగ్గుతాయని తెలిపారు. మహమ్మారిపై పోరాటానికి ఊతమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ దేశానికి గొప్ప చేస్తున్నారని అన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నందుకు తాను ఆయనకు గొప్ప అభిమానిని చెప్పారు. కానీ పిల్లలకు టీకాలు వేయడంపై ఆయన తీసుకున్న అశాస్త్రీయ నిర్ణయంతో తాను పూర్తిగా నిరాశ చెందానని తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్ లో పోస్టూ చేస్తూ ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు.
భారత్‌లో పిల్లలకు ఏ వ్యాక్సిన్ వేస్తారు?.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది?.. ఇక్కడ తెలుసుకోండి
కరోనావైరస్ తీవ్రతను, మరణాన్నినిరోధించే ఏదైనా నిర్ణయానికి స్పష్టమైన లక్ష్యం ఉండాలని అన్నారు. కొన్ని దేశాల్లో బూస్టర్ డోసులు తీసుకున్న తర్వాత కూడా ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారని రాయ్ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఈ బూస్టర్ డోసులతో ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువగా ఉందని చెప్పారు. అయితే చిన్నారులకు కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చిన్నారుల్లో మిలియన్ జనాభాకు రెండు మరణాలు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. ఇది చాలా పిల్లల్లో ఇన్ఫెక్షన్ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలుపుతోందని అన్నారు. అయితే పిల్లలకు ఇచ్చే టీకా విషయంలో ప్రతికూల ప్రభావాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
పంచాయతీ ఎన్నికల రద్దు.. ఆ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకున్న మధ్యప్రదేశ్ సర్కార్..!
పిల్లలకు కోవాగ్జిన్..
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం జాతినుద్దేశించి మాట్లాడారు. 12-18 ఏళ్ల మధ్య పిల్లలందరికీ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. అలాగే ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్ వారియర్స్‌కు అదనంగా మరో డోసు వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. అయితే పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ విషయంలో ఆదివారం క్లారిటీ వచ్చింది. పిల్లలకు కోవాగ్జిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను మూడు రకాల వయస్సు పిల్లలపై ప్రయోగించారు. 12 -18 ఏళ్లు, 6-12 ఏళ్లు, 2-6 ఏళ్ల మధ్య పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. తొలుత 12-18 ఏళ్ల పిల్లలపై ఈ వ్యాక్సిన్ ను పరిశీలించారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో చిన్నారులపై కోవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశారు. ఈ ఫలితాలను భారత్ బయోటెక్ సంస్థ డీసీజీఐకి పంపింది. సుమారు 525 మంది చిన్నారులపై రెండు, మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ కోవాగ్జిన్‌నే ఇవ్వనున్నారు.