బిహార్‌లోనూ ‘మహా’ ఆపరేషన్? ఈసారీ పార్టీ చీలికను నితీశ్ అడ్డుకుంటాడా? విపక్షాల ఐక్యతపైనా ఎఫెక్ట్!

Published : Jul 03, 2023, 08:06 PM ISTUpdated : Jul 03, 2023, 08:34 PM IST
బిహార్‌లోనూ ‘మహా’ ఆపరేషన్? ఈసారీ పార్టీ చీలికను నితీశ్ అడ్డుకుంటాడా? విపక్షాల ఐక్యతపైనా ఎఫెక్ట్!

సారాంశం

మహారాష్ట్రలో అజిత్ పవార్.. షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరడం దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. సుమారు ఏడాది కాలంలో బీజేపీకి దూరంగా జరిగిన రెండు పార్టీలు శివసేన, ఎన్సీపీలో చీలికలు వచ్చే పరిస్థితులు ఏర్పడటం, వాటిని చూపి ఇతర విపక్ష పార్టీలకూ హెచ్చరికలు వస్తున్నాయి. తర్వాతి టార్గెట్ బిహార్ అని  కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే పేర్కొనడం గమనార్హం.  

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో శివసేన, బీజేపీలు భావసారూప్య పార్టీలు. ఈ రెండు పార్టీలవి రైట్ వింగ్ ఐడియాలజీ. సీఎం సీటు వివాదమై గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అప్పటి శివసేన, బీజేపీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. మహాఘట్ బంధన్‌గా ఏర్పడి కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ, అధికారానికి దగ్గరగా వచ్చి.. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేసిన తర్వాత బలం లేక బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత అంటే గతేడాది జూన్‌లో శివసేనపై ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో సుమారు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. బీజేపీతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చారు. శివసేన రెండుగా చీలిపోయింది. అప్పుడు దేశవ్యాప్తంగా ‘షిండే’ చర్యలు చర్చనీయాంశమయ్యాయి. పలు విపక్ష రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతలు షిండేలను తయారు చేస్తామని బెదిరించే వరకూ పరిస్థితులు వెళ్లాయి.

అలాంటి ఆపరేషనే అదే రాష్ట్రంలో మరోసారి జరిగింది. ఇప్పుడు ఎన్సీపీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు షిండే, ఫడ్నవీస్ ప్రభుత్వంతో చేతులు కలిపారు. దీంతో మరోసారి పార్టీ చీల్చే ఆపరేషన్ల గురించి టాక్ వినిపిస్తున్నది. నెక్స్ట్ టార్గెట్ బిహార్ అనే మాటలు బీజేపీ సీనియర్ నేతలు, కేంద్రమంత్రి నుంచీ వినిపించడం చర్చనీయాంశమైంది.

షిండే ద్వారా శివసేన పార్టీ చీలిపోయి అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసిన కాలంలో బిహార్‌లోనూ అనూహ్య రాజకీయాలు జరుగుతున్నాయి. బిహార్ ఎన్డీఏ కూటమిలో పెద్దన్నగా ఉన్న జేడీయూ 2020 అసెంబ్లీ ఎన్నికలతో దెబ్బతిన్నది. నితీశ్ కుమార్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. చాలా వరకు బీజేపీ గెలుచుకుంది. ఎమ్మెల్యేల బలంగా తక్కువ ఉన్నప్పటికీ సీఎంగా నితీశ్‌కే అవకాశం ఇచ్చింది. నితీశ్‌ నిస్సహాయుడిగా ఉండగా.. ఎన్డీయేలో ఉండటంతో జేడీయూ నేతలకు బీజేపీతో సఖ్యత పెరిగింది. రాజ్యసభ ఎంపీగా ఆర్సీపీ సింగ్ వద్దని నితీశ్ వారించినా.. బీజేపీ ఆయనకే అవకాశం ఇచ్చింది. రెండోసారికి నితీశ్ స్వయంగా చెక్ పెట్టాడు. ఈ సంకేతాలతో బిహార్‌లోనూ మహారాష్ట్ర ఆపరేషన్ అమలయ్యే ముప్పు ఉన్నదని నితీశ్ భావించాడు. తన పార్టీ చీలిపోయే భయం ఆవరించింది. దీంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు. మధ్యంతర ఎన్నికలను తప్పించుకుని ప్రతిపక్షాలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తన పార్టీ నేతలను బీజేపీ తన వైపు తిప్పుకునే కుట్ర చేసిందని నితీశ్ ఆలోచన. 

Also Read: జాతీయ రాజకీయాల్లో ‘జై కిసాన్, జై జవాన్’ నినాదం కేసీఆర్‌ను గట్టెక్కిస్తుందా?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాం విలాస్ పాశ్వాన్ (ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు) తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఫ్యాక్టర్ జేడీయూను దెబ్బతీసింది. ఆయన ఎల్జేపీ పార్టీ నుంచి బీజేపీ తిరుగుబాటు నేతలను చాలా చోట్ల జేడీయూ అభ్యర్థులపై నిలబెట్టడంతో నితీశ్ దెబ్బతిన్నాడు.

అప్పుడు ముందుగానే సంకేతాలను అందుకుని ఎన్డీయే నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మరోసారి అలాంటి ముప్పే వస్తున్నదని చర్చిస్తున్నారు. ఇప్పటికీ కొందరు జేడీయూ ఎమ్మెల్యేలే బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. జేడీయూతోపాటు, ఆర్జేడీ ఎమ్మెల్యేలూ తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ సింగ్ వెల్లడించడం ఈ భయాలను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలోనే నితీశ్ కుమార్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేలను తన అదుపులో పెట్టుకుంటే ఈ ముప్పు నివారించవచ్చు.

ఇప్పుడు విపక్షాల ఐక్యత కోసం పట్నాలో మొదటి మెట్టు ఎక్కించడంలో నితీశ్ కుమార్ పాత్ర కీలకంగా ఉన్నది. కాబట్టి, ఒక వేళ మహారాష్ట్ర వంటి ఆపరేషన్ అక్కడ జరిగితే జేడీయూ అక్కడ బిహార్ ప్రభుత్వమే ఉనికిని కోల్పోయే ముప్పు ఉండగా.. విపక్షాల ఐక్యతా రాగం కూడా కొంతకాలమైనా మూగబోయే అవకాశాలు ఉన్నాయి. నితీశ్‌కు శిబిరాలు మార్చడం కొత్తేమీ కాదు. పార్టీ ఎమ్మెల్యేల్లో మెజార్టీ భాగం బీజేపీ వైపు మొగ్గుచూపితే.. ఆయన స్వయంగానూ దుకాణం ఎత్తేసే అవకాశాలు లేకపోలేదని  ఆయన చరిత్రను పరిశీలించినవారు అంటున్నమాట.

Also Read: కాంగ్రెస్‌లో అంతర్గత ఆధిపత్య పోరు.. ఖమ్మం భారీ సభ.. ఎవరిది పైచేయి?

అయితే, నితీశ్‌ను మళ్లీ నమ్మే ప్రసక్తే లేదని తీర్మానం కూడా బిహార్ బీజేపీ చేసింది. ఆయనను ఎట్టిపరిస్థితుల్లోనూ కలుపుకోబోమని బీజేపీ అధిష్టానం కూడా పేర్కొంది. నితీశ్ కుమార్ కూడా తన పార్టీని తన నుంచే లాక్కునే కుట్ర చేసిన బీజేపీతో దోస్తీ చెయ్యబోననే ధోరణిలోనే ఉన్నాడు. అందుకే ఏకంగా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనీ, అలాగే, జాతీయ రాజకీయాల్లోకి రావాలనే తన ఆకాంక్షను అనుసరించి విపక్షాల ఐక్యతకు కృషి చేస్తున్నాడు.

ఎన్డీయే నుంచి జేడీయూ బయటకు వచ్చినప్పటి నుంచి బిహార్ వెళ్లిన ప్రతిసారీ నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఈ సారి సంయమనం పాటించాడు. అంతేకాదు, అవినీతిపరుల పక్షం ఎందుకు వెళ్లుతున్నాడని.. వారికి దూరంగా ఉండాలనే సూచనలు చేస్తూ అమిత్ షా మాట్లాడటం చర్చనీయాంశమయ్యాయి.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఉంటాయి. ఇంతలోపు బీజేపీ ఎంపీ సీట్ల కోసం ఫోకస్ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకు ఏ దారి ఎంచుకుంటుందనేది ఇప్పటికైతే తెలియదు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం