మహిళల పోరాటంతో 30 ఏళ్ల క్రితం మణిపూర్ రాష్ట్రంలో మద్యపానంపై సంపూర్ణ నిషేధాన్ని అప్పటి ప్రభుత్వం విధించింది. అయితే.. ఇప్పుడు అక్కడి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతకీ ఈ నిర్ణయాన్ని బీజేపీ ఎందుకు తీసుకుంది?
మద్యపానంపై నిషేధం కొనసాగాలని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, సంస్కర్తలు కోరుతుంటారు. కొన్ని సార్లు డిమాండ్ చేసుకుని వీటిని సాధించుకుంటారు కూడా. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోనూ మహిళలు మద్యపాన నిషేధం కోసం పోరాడారు. సామాజిక సమస్యలు, కుటుంబ వివాదాలు, హింస చెలరేగడంతో మహిళలు కదం తొక్కారు. వీరికి ఇతర శ్రేణులు మద్దతు పలికాయి. చివరకు ప్రభుత్వం రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి అంగీకరించింది. ఓ చట్టాన్ని కూడా తెచ్చింది. ఇది 30 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించింది. మద్యపానంపై నిషేధాన్ని బేషరతుగా ఎత్తేసింది. బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
రాష్ట్రంలో మద్యం తయారీ, ఉత్పత్తి, కలిగి ఉండటం, ఎగుమతి, దిగుమతి, క్రయ విక్రయాలు, మద్యపానం సేవనంపైనా నిషేధాన్ని మణిపూర్ ప్రభుత్వం ఎత్తేసింది. 30 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మద్యపానంపై నిషేధాన్ని సీఎం ఎన్ బీరెన్ సింగ్ సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 6వ తేదీన ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్ర రాబడి పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, ప్రాణాంతకమైన నకిలీ లిక్కర్‌కు ఫుల్ స్టాప్ పెట్టడానికి రాష్ట్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 22వ తేదీన మద్యపానంపై పాక్షికంగా ఆంక్షలు సడలించారు. జిల్లా కేంద్రాల్లో, హోటళ్లలో మద్యం అమ్మకం, సేవించడానికి అనుమతించారు. స్థానికంగా తయారు చేసే దేశీ దారును పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా, మద్యపానంపై నిషేధాన్ని పూర్తిగా ఎత్తేసింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా చర్చలో నానింది. మైతేయిలు, కుకీలకు మధ్య హింసాత్మక ఘర్షణను అదుపు చేయలేకపో యిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.