
ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లిపక్కన పడుకున్న పసిబిడ్డను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడో దుండగుడు. కానీ తల్లికి మెలకువ వచ్చి వెంటపడటంతో పసికందును రోడ్డుపైనే విసిరేసి పరారయ్యాడు దుర్మార్గుడు. ఇలా కిడ్నాపర్ క్రూరత్వానికి పసిబిడ్డ బలయ్యింది.
పోలీసుల కథనం ప్రకారం... ఉత్తర ప్రదేశ్ షాజహాన్ పూర్ రైల్వేస్టేషన్ వద్ద వైశాలి(25) బిచ్చమెత్తుకుని జీవిస్తోంది. ఇటీవల భర్త మద్యంమత్తులో గొడవ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దీంతో ఇద్దరు బిడ్డలతో కలిసి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ తాత్కాలిక గుడారంలో నివాసముంటోంది వైశాలి. రైల్వే స్టేషన్ వద్ద బిచ్చమెత్తి ఆ డబ్బులతో బిడ్డలిద్దరిని పోషించుకుంటోంది.
రోజూ మాదిరిగానే బుధవారం షాజహాన్ పూర్ రైల్వేస్టేషన్ వద్ద బిచ్చమెత్తుకుంది వైశాలి. రాత్రి ఆ స్టేషన్ ప్రాంగణంలోనే ఇద్దరు బిడ్డలను తీసుకుని పడుకుంది. అయితే అర్థరాత్రి వైశాలి గాడనిద్రలో వుండగా ఓ దుండగులు ఆమె పక్కనున్న ఎనిమిది నెలల పసికందుకు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ కూతురు ఏడుపువిని నిద్రలేచిన తల్లి కేకలు వేస్తూ దుండగుడి వెంటపడింది. దీంతో ఎక్కడ దొరికిపోతానోనని భయపడిపోయిన దుండుగుడు పరుగెడుతూనే పసికందును నేలపైకి విసిరేసాడు. దీంతో ఆ పాప తీవ్రంగా గాయపడింది.
Read More కేవలం స్నాక్స్ కోసం యువతి ఆత్మహత్యాయత్నం... భర్త్ డే జరుపుకుని 24 గంటలు కూడా కాలేదు...
స్థానిక పోలీసుల సాయంతో తన బిడ్డను హాస్పిటల్ కే తీసుకెళ్లింది వైశాలి. కానీ తీవ్రంగా గాయపడ్డ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో శవపరీక్ష అనంతరం పసికందు మృతదేహాన్ని తల్లికి అప్పగించారు వైద్య సిబ్బంది. ముక్కుపచ్చలారని కూతురు ఇలా దుండుగుడి చేతిలో బలవడంతో ఆ తల్లికి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
బాధిత తల్లి వైశాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో సిసి కెమెరాలను పరిశీలించిన చిన్నారిని అపహరించడానికి ప్రయత్నించింది సిందౌలికి చెందిన అశోక్ కుమార్ గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి ఐసిపి 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు షాజహాన్ పూర్ పోలీసులు తెలిపారు. ఈ చిన్నారి కిడ్నాప్ వ్యవహారంతో మరికొందరి ప్రమేయం వున్నట్లు తెలుస్తోందన్నారు. కానీ చిన్నారిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారో తెలియాల్సి వుందని... అందుకోసం కిడ్నాపర్ అశోక్ ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.