
న్యూఢిల్లీ: అందమైన అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తారా? వారితో ఎంజాయ్ చేస్తారా? అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి.. అంటూ ఓ మోసం మొదలైంది. అది నిజమే అని నమ్మిన 71 ఏళ్ల వృద్ధుడు లక్షలు కోల్పోయాడు. ఆయన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి.. వృద్ధుడు. అయినా.. అందమైన అమ్మాయిలంటూ వల వేశారు. ఆ వృద్ధుడు పేరాశకు పోయి చిక్కాడు. రూ. 4.5 లక్షలు తన చేతుల ద్వారా అర్పించుకుని మోసపోయాడు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముంబయిలోని సమతానగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఠాకూర్ కాంప్లెక్స్‌కు చెందిన సీనియర్ సిటిజెన్‌కు మార్చి 23న ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజీ నిజమే అని నమ్మి వారు సూచించిన నెంబర్‌కు కాల్ చేశాడు. మోసం మొదలైంది.
ఆ కాల్‌ను ఓ మహిళ స్వీకరించింది. అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తారా? అంటూ అడిగి.. కొందరి అమ్మాయిల ఫొటోలను పంపింది. ఫ్రెండ్షిప్, ఎంజాయ్‌మెంట్ కోసం వారిలో ఎవరినైనా ఎంచుకోవాలని చెప్పింది. అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 2,100 చెల్లించాలని అడిగింది. ఆ రిజిస్ట్రేషన్ కోసమని రూ. 2,100 చెల్లించి ఫొటోలు చూశాడు. స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకుని నెఫ్ట్ ద్వారా డబ్బులు పంపించాడు.
Also Read: తనకు పెళ్లైనట్టు లివ్ ఇన్ పార్ట్‌నర్‌కు ముందే చెబితే.. అది మోసం కాదు: కలకత్తా హైకోర్టు
రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ వృద్ధుడు మళ్లీ మళ్లీ పేమెంట్లు చేశాడు. ఓ యువతితో డేటింగ్ చేస్తానని ఏప్రిల్ 4వ తేదీ వరకు పేమెంట్లు చేస్తూనే వెళ్లాడు. అప్పటి వరకు సుమారు రూ. 4.42 లక్షలు చెల్లించాడు. రిజిస్ట్రేషన్ తర్వాత చెల్లించే డబ్బులు తిరిగి వస్తాయని హామీ ఇవ్వడంతో ఆయన డబ్బులు చెల్లిస్తూనే వెళ్లాడు.
అయితే, ఆయన అకౌంట్‌లో డబ్బులు అయిపోయినా ఇంకా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో కొందరు మిత్రుల నుంచి డబ్బులు అడిగి మరీ పంపించాడు. అయినా రకరకాల కారణాలు చెబుతూ ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆ వ్యక్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించారు.