అంబులెన్స్‌లోనే కోవిడ్‌ రోగిపై డ్రైవర్ అత్యాచారం, క్వారంటైన్‌లో నిందితుడు

By Siva KodatiFirst Published Sep 6, 2020, 4:17 PM IST
Highlights

కామంతో కళ్లు మూసుకుపోయినవాడికి చుట్టూ ఏం జరుగుతుందన్న సంగతి అనవసరం ఆ సమయంలో తన కామవాంఛ తీర్చుకోవడమే ముఖ్యం. కరోనా వచ్చినట్లు  తెలిస్తే చాలు జనం వారికి దూరంగా పారిపోతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వైరస్ సోకిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

కామంతో కళ్లు మూసుకుపోయినవాడికి చుట్టూ ఏం జరుగుతుందన్న సంగతి అనవసరం ఆ సమయంలో తన కామవాంఛ తీర్చుకోవడమే ముఖ్యం. కరోనా వచ్చినట్లు  తెలిస్తే చాలు జనం వారికి దూరంగా పారిపోతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వైరస్ సోకిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే..కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు  శనివారం సాయంత్రం తెలిసిందే. కేరళలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. పాజిటివ్ వచ్చిన వారు ఆసుపత్రికి అంబులెన్స్‌లో మాత్రమే వెళ్లాలి.

కుటుంబసభ్యులు ఓ మహిళను స్థానిక కోవిడ్ ఆసుపత్రికి చేర్చారు. మరో మహిళను చేర్చేందుకు అక్కడ అవకాశం లేకుండా పోయింది. దీంతో వారు అంబులెన్స్‌కి కాల్ చేశారు. రాత్రి సమయంలో అంబులెన్స్ వారి ఇంటికి వచ్చింది.

అయితే హెల్త్ కేర్ అధికారులు.. బాధితురాలిని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా డ్రైవర్‌కి చెప్పారు. 22 ఏళ్ల మహిళ అంబులెన్స్‌లో పడుకుంది. కాసేపటికి వాహనం ఓ చోట ఆగింది.

ఆసుపత్రి వచ్చిందేమోని భావించిన ఆమె లేచి చూసింది. చుట్టూ చూస్తే అంతా చీకటిగా ఉంది. ఇంతలో అంబులెన్స్ డ్రైవర్ ఆమె వద్దకు వచ్చి తలుపులు మూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అనంతరం ఆమెను కోవిడ్ ఆసుపత్రి వద్ద దించేసి వెళ్లిపోయాడు. తనపై జరిగిన దారుణాన్ని బాధితురాలు డాక్టర్లకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు చేయించగా నిజమేనని తేలింది. సదరు అంబులెన్స్ డ్రైవర్‌ గతంలో చాలా నేరాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇందులో ఓ హత్యాయత్నం కేసు కూడా వుంది. ఈ ఘటనతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై మహిళా కోవిడ్ రోగులను తరలించే అంబులెన్స్‌లో భద్రతా చర్యలు చేపట్టనుంది. రాష్ట్రంలో అంబులెన్స్ డ్రైవర్ల చిట్టాను బయటకు తీస్తున్నారు అధికారులు.

కాగా ఈ ఘటనపై లోతైన దర్యాప్తుకి ఆదేశించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆ కామాంధుడిని పోలీసులు క్వారంటైన్‌లో ఉంచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడిని న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. 

click me!