
న్యూఢిల్లీ: ఒక వైపు కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో విజయాలతో ఫామ్‌లోకి వస్తుండగా.. అపోజిషన్ జోడో కార్యక్రమంలో బిహార్ సీఎం, డిప్యూటీ సీఎం నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్‌లు తలమునకలై ఉన్నారు. తాజాగా, వీరిద్దరు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. రాజ్యసభలో కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టడానికి వీరిద్దరూ ప్లాన్ వేశారు. ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో విపక్షాలు అన్నీ ఏకమై అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్‌గా ఉంటుందని అన్నారు. ఒక వేళ విపక్షాలు అన్నీ ఏకమై ఈ ఆర్డినెన్స్‌ను నెగ్గకుండా చేస్తే మాత్రం 2024లో కేంద్రంలో బీజేపీ రాదనే సందేశం దేశం నలుమూలలకు వెళ్లుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఇందుకు తాము మద్దతిస్తామని, ఆప్ వెంటే తామూ ఉన్నామని నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ అన్నారు.
ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలును అడ్డుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగ్‌లు, బదిలీలపై నిర్ణయాధికారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కే ఉంటుందని ఈ ఆర్డినెన్స్ పేర్కొంటున్నది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఇది సుప్రీంకోర్టు ధిక్కరణే అని ఆప్ విమర్శలు చేస్తున్నది.
ఈ తరుణంలో నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్.. అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీ ప్రభుత్వానికి చేస్తున్న అన్యాయాన్ని ఎదురిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమై పోరాడుతామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ పోరాటంలో అన్ని బీజేపీయేతర విపక్ష పార్టీలు ఏకం కావాలని విజ్ఞప్తి చేస్తున్నానని వివరించారు. తద్వార కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ఓడించడం సాధ్యమవుతుందని తెలిపారు. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమనే సందేశం దేశమంతటా విస్తరిస్తుందని చెప్పారు.
Also Read: రూ. 2000 నోట్లు మార్పిడికి ఆధార్, పాన్ కార్డులు అవసరమా?. SBI గైడ్‌లైన్స్‌లో వివరణ
ఎన్నికైన ప్రభుత్వం నుంచి ఎలా అధికారాన్ని కేంద్రం లాక్కుంటుందని నితీశ్ కుమార్ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వం పని చేయడానికి సుప్రీంకోర్టు హక్కు ఇచ్చిందని, దాన్నీ ఎలా లాక్కుంటారని అడిగారు. ఇది షాకింగ్‌గా ఉన్నదని వివరించారు. తాము ఆప్‌కు అండగా ఉంటామని, మరిన్ని మీటింగ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. తమకు వీలైనంత మేరకు ప్రతిపక్షాలను కూడగట్టుతామని, ఈ అంశంపై దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తామని పేర్కొన్నారు. చట్టాన్ని తప్పకుండా పాటించాలని, ప్రజలు సంయమనంతో ఉండాలని అన్నారు.
మే 23వ తేదీన తాము పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతామని, ఈ విషయంపై మాట్లాడుతామని నితీశ్ కుమార్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌లతో మే 24వ తేదీ, మే 25వ తేదీన మాట్లాడుతామని వివరించారు. రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్‌ను అడ్డుకునే ప్రణాళికలపై మాట్లాడుతామని చెప్పారు.
కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను పేర్కొంటూ ఇది దేశ ప్రజాస్వామ్యానికే ముప్పు అని తేజస్వీ యాదవ్ అన్నారు. వారు దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారని, దాన్ని తాము అడ్డుకుని తీరుతామని తెలిపారు.