వృద్ధ యాత్రికులకు విమాన ప్రయాణం.. చౌహాన్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం, దేశంలోనే తొలిసారి

Siva Kodati |  
Published : May 21, 2023, 03:31 PM IST
వృద్ధ యాత్రికులకు విమాన ప్రయాణం.. చౌహాన్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం, దేశంలోనే తొలిసారి

సారాంశం

మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. వృద్ధులైన యాత్రికులకు విమాన ప్రయాణాన్ని అందించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ మేరకు ఆదివారం ప్రయాణీకులకు విమానాశ్రయంలో వీడ్కోల్ పలికారు సీఎం. 

ప్రస్తుతం దేశంలో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. నిన్న గాక మొన్న కర్ణాటక ఎన్నికలు ముగిసినప్పటికీ.. ఈ ఏడాది తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఏడాది అత్యంత కీలకం. ఇదే సమయంలో రాజకీయ నాయకులంతా యాక్టీవ్ అయ్యారు.

అటు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో వున్న పాలక పక్షాలు కూడా ఆకర్షణీయమైన పథకాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. యాత్రికులకు విమాన సౌకర్యాన్ని అందించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఈ రోజు భోపాల్ నుంచి ప్రయాగ్ రాజ్‌ తీర్ధయాత్రకు బయల్దేరిన 32 మంది వృద్ధులకు విమాన సౌకర్యాన్ని అందించింది. 

ఆదివారం ఉదయం భోపాల్‌లోని రాజా భోజ్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జెండా ఊపి ‘‘తీర్ధ్ దర్శన్ యోజన’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ 32 మంది బృందంలో 24 మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు వున్నారు. ఈ కార్యక్రమంలో తొలి దశ కింద మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ సిటిజన్లు రాష్ట్రంలోని పలు విమానాశ్రయాల నుంచి ఈ ఏడాది జూలై వరకు పలు బ్యాచ్‌లలో ప్రయాణించనున్నారు. 

ఈ సందర్భంగా 72 ఏళ్ల రామ్ సింగ్ కుష్వాహా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. గాలిలో ఎగరాలనేది ప్రతి ఒక్కరి కల అన్నారు. ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని కోరుకుంటారని పేర్కొన్నారు. ఇప్పుడు మా కల నెరవేరుతోందన్నారు. ఇక తాను జీవితంలో తొలిసారి రాష్ట్రం దాటి వెళ్తున్నానని రాందాస్ అనే ప్రయాణీకుడు అన్నాడు. ఇక ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కూడా ఉద్వేగానికి గురయ్యారు. ఈ రోజు తన కల సాకారమైందని.. తన తల్లిదండ్రుల వంటి వృద్ధులను విమానంలో తీర్ధయాత్రలకు పంపుతున్నానని ఆయన పేర్కొన్నారు. 

2012లో బీజేపీ హయాంలో ముఖ్యమంత్రి తీర్ధ్ దర్శన్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ప్రత్యేక రైళ్ల ద్వారా వృద్ధులను ఉచితంగా తీర్ధయాత్రలకు పంపుతున్నారు. అయితే యాత్రికులను విమానం ద్వారా పంపడం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు 7.82 లక్షల మంది సీనియర్ సిటిజన్లు ఈ తీర్థయాత్ర పథకం కింద ప్రయోజనం పొందారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అధికార బీజేపీ ప్రభుత్వం కొత్త పథకాల ద్వారా వివిధ వర్గాల పౌరులను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Assembly Building Shines in Tricolour Laser Lights | Republic Day Celebrations | Asianet News Telugu
Top 5 South Indian dishes : ప్రాంతాల పేర్లతో ప్రపంచానికి పరిచయమైన దక్షిణాది వంటకాలు ఇవే..!