డాక్టర్ గాదె వెంకటేష్ తెలుగు కవిత: కుంట

By telugu teamFirst Published Aug 21, 2020, 12:25 PM IST
Highlights

కాలగర్భంలో కలిసిన కుంటలకు లేని కులం ఆధునికంగా వెలసిన కాల్వలకు ఎట్లున్నదో కవి గాదె వెంకటేష్ తన కవిత 'కుంట' లో ఏవిధంగా కవిత్వీకరించరో చదవండి.

1.ఊరగుంట-బంధంకుంట-సాకరి కుంట.
కారు కారు కు పంటకాన్పెల్లదీస్తూ
వానాకాల మొచ్చిందంటే 
ద్వీపకల్పంలా ఉంటుండే మా ఊరు.

2.కుంటనిండితే చాలు
అలుగవతల పొరలు 
ఇవతల బుడువుంగ పిట్టలు
పిలుకజుట్టోలే తేలిన తుమ్మ కొమ్మలు 
మునిగిన లొట్లపీసు సెట్లు
దూప దీర్చుకునే కుంట కట్ట
కాగితపు పడవలతో కొలువుదీరిన 'shipyard' మా కుంట.

3.పొద్దు గాళ్ళ ఊరిడిసిన మురికిని
రంగుదిద్దిన నీళ్ళని అలుముకొని
అలల అంచుకు సూర్యరష్మిని అద్దిన ఓణేసుకొని 
కట్ట పొంటి పోతుంటే కన్ను గీటుతూ
'ట్యాంకుబండ్' ని తలపిస్తుంది మా కుంట.
4.కుంట నిండితే సుట్టు పక్కల్లోకు 
కడుపు మంట
అము(వు)రించుకొని వేసిన 'గుంటల' భూమిపంట
మునుగుతుందేమోనని తంట.

5.వానాకాలం తూముల్లోంచి మత్తడై దుంకిన కుంట
ఎండాకాలం ఏ మూలకో మిల్గిన సుక్కలు
గొర్లు గోదాలకు గొంతు తడిమి
చెరువు లేని చింతను తీర్చిన కుంట
నిండిన-ఎండిన ఊరెంటే.

6.కాలగర్భంలో కబ్జాల పాలైన
కుంటకు కులముండకపోతుండే
నిండితే ఇంత కూలి దొరుకుతుండే మాకు
గిప్పుడు మాఊరికొచ్చిన
కాల్వ కండ్లకు పల్లం పట్టదు
ఎంత లోతైన, ఎన్ని వంకర్లు  తిర్గిన నీళ్ళ కాళ్ళు
 భూస్వాముల భూమలల్ల కెళ్లే  వెళ్ళు .

7.ఊరుకొచ్చిన
కాల్వలు-పండుగలు
మా పొలంలకు - ఇండ్లకు ఇంకెప్పుడొస్తయో.

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

click me!