బహుజన కులాల్లో ఒకటి అయిన గొల్లకులం ఆర్థికంగా, సామాజికంగా ఎలా వెనుక పడ్డారు అనే విషయాలకు కారణాలు చెబుతూ, ఈ సమాజం ఎదుగుదలకు వారు ఎంత వరకు సహకరించారనే విషయాలను చక్కగా వివరించారు
- సరోజన
సోదరుడు డా. పోతరవేని తిరుపతి యాదవ్, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ పూర్తిగా శాస్త్రీయంగా అధ్యయనం చేసి రాసిన గొప్ప పుస్తకం ఇది. ప్రతి విషయాన్ని క్షుణంగా తెలుసుకొని అక్షరాలను పొందు పరిచిన పుస్తకమే గొల్లల చరిత్ర సంస్కృతి . ఇది ఒక గొల్ల జాతి వాళ్ళు మాత్రమే చదివే పుస్తకం కాదు. బహుజన కులాలకు సంబంధించిన పుస్తకం ఇది. మిగతా బహుజన కులాల కూడా తమ చరిత్రను ఏ విధంగా రాసుకోవాలొ మార్గం చూపే పుస్తకం ఇది.
undefined
ఉత్పత్తి కులాల్లో ఒకటిగా మరియు అర్ద సంచార జాతికి చెందిన గొల్ల కులం పుట్టుక, ఈ కులం వాళ్లకు గొల్ల కులం అని పేరు ఎలా వచ్చింది, వాళ్ళ నాగరికత, ఆచారాలు, సాంప్రదాయాలు, వారి జీవన విధానం, వాళ్ళ కట్టు, బొట్టు, వాల్ల కుల దైవాలు,వాల్ల జాతరలు మొదలైన అంశాలతో పాటు ఈ కులానికి ఉన్న ప్రత్యేకతలను గురించి ఈ రచయిత క్లుప్తంగా, ఎంతో వివరంగా పొందు పరిచిన పుస్తకం ఇది.
బహుజన కులాలో ఒకటైనా ఈ గొల్ల కులంకు రిజర్వేషన్ పేరిట ఉద్యోగాల్లో, ఉపాధిలో జరిగే అన్యాయం విడమరిచి చక్కగా వివరించారు.
ఇక ఈ గొల్ల కులం వాళ్లకు అది నీ కులం, ఇది నా కులం అనే కులబేధాలు ఉండవని స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకు నిదర్శనం పూర్వకాలంలొనే జరిగిన కులాంతర వివాహాలు, అలాగే గొల్లలు తమ ఉత్పత్తి వస్తువులను కుల మత బేధం చూపకుండా అన్ని కులాలకు సమానంగా అందించి నాటి నుండి సమానత్వంకు శ్రీకారం చుట్టిన ఆద్యులుగా చెప్పవచ్చు.
బహుజన కులాల్లో ఒకటి అయిన గొల్లకులం ఆర్థికంగా, సామాజికంగా ఎలా వెనుక పడ్డారు అనే విషయాలకు కారణాలు చెబుతూ, ఈ సమాజం ఎదుగుదలకు వారు ఎంత వరకు సహకరించారనే విషయాలను చక్కగా వివరించారు ఈ రచయిత.
ఇక ఈ పుస్తకంలో రచయిత పాఠకులకు అర్ధం అయ్యేలా, ఒక క్రమంలో అధ్యయాల వారీగా అంశాలను చక్కగా పొందు పరచడం రచయిత నిబద్దతగా చెప్పవచ్చు. ఇందులో అధ్యయాలు వరుసగా
1.పరిచయం
2.గొల్లల పుట్టుక_చారిత్రక నేపథ్యం
3.గొల్లల రకాలు
4.గొల్లల ఆచారాలు
5.గొల్లల జీవన విధానం
6.గొల్లల ఆశ్రీత కులాలు_జానపద కళారూపాలు
7.గొల్లల పండుగ_కొలువులు
8.గొల్లల ప్రధాన జాతరలు
9.ముగింపు.
ఇంత గొప్ప పుస్తకం గురించి నేను పూర్తిగా వివరణ ఇవ్వలేక పోవచ్చు, కానీ ఈ పుస్తకం చదివిన తరవాత నాకు తోచిన నాలుగు వాక్యాలు మీ ముందు ఉంచాలనే ఈ నా చిన్ని ప్రయత్నం.
- పరిచయం:
ప్రాచీన నాగరికతకు చెందిన భారతీయులు పశుపోషణ చేసేవారని, ఈ పశుపోషణ నిమిత్తం వాళ్ళు సంచారం చేసి వాటిని పోషించే వారని, వాళ్ళ ఈ పశుపోషణ మాంసంకోసం, వాటి ఉన్ని కోసం, ఇంకా వాటి ఎరువు కోసం. తద్వారా వ్యవసాయం చేసి పంటలు పండించడానికి.
- గొల్లల పుట్టుక - చారిత్రక - నేపథ్యం:
'గొల్ల' పదం గోపాల్ అనే సంస్కృత పదం నుండి పుట్టింది. వీళ్ల ప్రధాన వృత్తి పశుపోషణ. గొర్లు, మేకలు, బర్లు, ఆల మందలను పోషించేవాళ్ళు.
గోవుల కాపరి/ గొర్ల కాపరిగా ఉన్నందున గొల్లవాళ్ళు అని ఒక పేరు. సంచార జాతులుగా వుండే వీరు పశువుల పోషణ నిమిత్తం ఊరు, ఊరు తిరుగుతూ పశువులను మేపేవారు. పశుపాలక దైవాలు అయిన మల్లన్న, బీరప్ప, ఈరన్న, కాటమ రాజు మఱియు లింగమతుల స్వామి సంతానంవారే ఈ గొల్లలు. వీరు 1940 తర్వాతనే యాదవులుగా పిలువబడ్డారు
- గొల్లల రకాలు:
1.ఎర్రగొల్ల లేదా కిలారి
2.బోయ గొల్ల
3.మాయ గొల్ల
4.పాకనాటి గొల్ల
5.పూజ గొల్ల
6.ముష్టి గొల్ల
7.మొదటి గొల్ల
8.ముద్ర గొల్ల
9.సలే గొల్ల
10.సస్రా గొల్ల
11.ఆది గొల్ల
12.గుజరాతి గొల్ల
13.ఆలే గొల్ల
14.పేదేటి గొల్ల
15.మంద గొల్ల
16.యాదవ గొల్ల
17.కర్ణ గొల్ల
18.గంప గొల్ల
19.కురుమ గొల్ల
ఇందులో నాకు తెలిసినవి కొన్ని గొల్ల కులాలే. ఇందులో కురుమ గొల్ల, మంద గొల్లలు గొల్ల కులం యొక్క ఉపకులాల వాళ్ళు. వీరు గొల్ల వాళ్ళను మాత్రమే యాచించేవారు.
- గొల్లల ఆచారాలు:
గొల్లల ఆచారాలు కూడా మిగితా బహుజన కులాలనే పోలి ఉంటాయి. పెళ్లి, పురుడు, చెవులు కుట్టిచ్చుడు, చీర కట్టిచ్చుడు, ఒడి బియ్యం పొయ్యడం, చావు కర్మ కాండ, పెద్దలకు బియ్యం ఇచ్చుడు, ఇలా అన్ని ఆచారాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఏవో కొద్ది పాటు మార్పులు తప్పితే. ఈ ఆచారాలు చుస్తే గొల్లలే మూలవాసులని, వీరి ఆచారాలే మిగతా బహుజనులకు ఆచరణీయమైనవి అని మనం అవగతం చేసుకోవచ్చు.
- దురాచారాలు :
గొల్ల కులంలో మూఢనమ్మకాలు, దూరాచారాలు కూడా బాగానే ఉన్నాయి. బాల్య వివాహం, జోగిని (దేవుని పేరు మీద జన్నేకు ఇడుసుడు) . గొల్ల కులంలో చిన్నప్పుడే వివాహం చేస్తారు. బిడ్డ పుట్టగానే మేనత్త వచ్చి ఇది నా కోడలు అని పేరు పెట్టుకోవడం.
పిల్లలను చదువుకు దూరం చేసి త్వరగా పెళ్లిళ్లు చేయడం. వీళ్ల ఆచారాలలో ఎన్నో మార్పులు వచ్చిన ఇప్పటికీ కొన్ని చోట్ల బాల్యవివాహాలు జరుగుతున్నాయి. ఇక జోగిని ఆచారానికి వస్తే పుట్టిన పిల్లలకు అనారోగ్యం ఉంటే వాళ్ళ కుల దైవాలకు మొక్కు కొని వాళ్ళను వాళ్ళ పేరు మీద పుట్టిన మొదటి సంతానంను జన్నకు ఇడుసుడు.అందువల్ల తరువాత పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా పుడతారు అని నమ్మకం.
జన్నకు ఇడుసుడు అంటే మగ, ఆడ వాళ్లకు దేవునితో పెళ్లి చేస్తారు. వాళ్ళు బ్రతికినంత కాలం దేవుడి పేరుతోనే వుంటారు. సిగంపూని శివ సత్తులుగా మారి దేవుణ్ణి చెప్తారు. ఇంట్లో ఏ కుల దైవాన్ని కొలిచిన వీళ్లు శివ సత్తులుగా మారి అడిగిన వారికి, వాళ్ళ బాధలకు కారణం ఏమిటి దేవుడనో ,దయ్యమనో దానికి విరుగుడు చెప్తారు. ఇలాంటి మూఢ నమ్మకాలు ఇప్పటికీ ఈ కులంలో కొనసాగుతున్నాయి. వీటి విరుగుడు విద్యనే అని రచయిత నొక్కి చెప్పారు.
- గొల్లల జీవన విధానం:
గొల్లల ప్రధాన వృత్రి పశుపోషణ. కొంత మంది వ్యవసాయం కూడా చేస్తారు. గొర్లు, మేకలు, బర్లు, ఆవులు మందలుగా చేసుకొని మేపుతూ వాటి పై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తారు. మందలకు పెద్దగొల్ల ఉంటాడు. ఇందులో ఆర్థికంగా వెనుక బడినవారు, అతని దగ్గరి నుండి పాలుకు తీసుకొని గాని, పాలేరు (బోయడు)గా ఉండిగాని పశువులను మేపుతూ జీవిస్తారు.
ఇక వీరి వస్త్రధారణ మాత్రం భిన్నంగా ఉంటుంది.మగవారు ముతక పంచెతో గోసి పెట్టుకొని కట్టుకుంటారు. చెవికి పోగు, కాళ్లకు బేడీలు, చేతికి దండె కడియాలు, నెత్తికి రుమాలు, భుజంపైన గొంగడి.ఇక ఆడవారు ముతక చీరను గోసి వెట్టి కట్టుతరు. ముడి రవిక ధరించి కొంత మంది గొల్లలు కుడి వైపు కొంగు వేస్తారు. ఇందులో ఎర్ర గొల్ల వాళ్ళు ఇలా వేస్తారు. కానీ ఇపుడు కొందరు ఎడమ వైపు వేస్తున్నారు. ఇక తలను సిగ ముడవడం, చెవికి పోగులు, పక్క పుల్లలు, ముక్కు పోగులు. కొంత మందికి ముక్కు కుట్టుకునే ఆచారం ఉండదు.
ఇక చేతికి దండె కడియాలు, కాళ్లకు మూడు జతల కడియాలు, నడుముకు ఒడ్డాణం ఇలా సాంప్రదాయ వేషధారణ ఉంటుంది. ఎంత మందిలో ఉన్నా వీరి వేషధారణ గుర్తు పట్టే విధంగా ప్రత్యేకమైనది.
ఇగ పశువులను మేపడానికి అడివికి మన్యం పోతరు. అక్కడే ఉండి పశువులను మేపుతూ, ఊరూరు తిరుగుతూ జీవనం సాగిస్తరు. కొంత మంది ఊళ్లనే పొలాల కాడ మందను పెడతరు. ఇట్లా మంద కాడ కావలి వుండే మనిషిని సందకావలి అంటరు. మందకాడికి కావలికి పోతూ సద్ధి, ఆనిగపు బుర్రల నీళ్లు తీసుకొని పోతరు. ఇగ మంద పెట్టినందుకు రొక్కం గాని ధాన్యం రూపంలో గాని తీసుకుంటరు.
పశువుల పాలు, పెరుగు, నెయ్యి, వాటి ఉన్ని( బూరు), ఎరువు అమ్మి జీవనం సాగిస్తరు. వాటి ఉన్నితో గొంగళ్ళు నేస్తరు.
- గొల్లల ఆశ్రిత కులాలు జానపద కళారూపాలు :
ఒగ్గోళ్ళు, మంద గోల్లోళ్లు, గొల్ల సుద్దులు, బైకాని వారు, తెరచీరల వారు, కొమ్ము మాదిగ, గంగి రెద్దుల వారు. ఇందులో మంద గొల్లలు పెద్ద గొల్ల ఇంటి ముందు ముందుగాల బొమ్మలు తీస్తారు, ధాన్యంను యాచిస్తారు. గొల్లలకు ఉన్నంత ఆశ్రిత కులాలు, ఏ కులంకు లేవని చెప్పవచ్చు. ఇది వీరి దానం గుణంకు నిదర్శనం.
- గొల్లల పండుగలు కొలుపులు:
అన్ని పండుగలతో పాటు మల్లన్న బోనాలు, బీరన్న బోనాలు, నోములు, ఇంట్ల ఉన్న అన్ని కుల దైవాలను కొలుసుడు, సట్ఠి వారాలలో మల్లన్న దేవునికి పట్నాలు ఏసుడు, చిన్న పట్నం, పెద్ద పట్నం, ఆచార పట్నం, గంగ పట్నం, ఇలా ఒగ్గోళ్లను తీసుకొచ్చి ఒగ్గు పూజారులతో పట్నాలు ఏసుకుంటారు. బీరన్న పట్నాలు గొల్ల కులం, కుర్మ కులం వాళ్ళు కలిసి ఏసుకుంటారు.
- గొల్లల ప్రధాన జాతరలు:
కొమురవెల్లి జాతర, ఐలోని జాతర, ఓదెల జాతర, పెద్దగట్టు జాతర వీరి ముఖ్య జాతరలు. కొమురవెల్లి జాతర సిద్దిపేట జిల్లాలో ఉంది. వరంగల్ జిల్లాలో ఐలోని జాతర, పెద్దపెల్లి జిల్లాలోని ఓదెలా జాతర, మంచిర్యాల జిల్లాలోని కత్తెరశాల మల్లన్న జాతర. ఇవి మన తెలంగాణ జిల్లాలో జరిగే మల్లన్న దేవుని జాతరలు. ఈ జాతరలు సంకురాతిరికి మొదలు అయ్యి ఉగాదికి ముగుస్తాయి. ఈ జాతరలు గొల్ల వాళ్ళవే అయినప్పటికీ ఒక గొల్లవాళ్లే కాక ఇతర కులం వాళ్ళు కూడా వస్తారు. కొమురవెల్లి కాడ ముందుగాల బోనం సమర్పించి దైవ దర్శనం చేసుకుంటారు. ఇంకా గంగిరేగు చెట్టు కింద పట్నాలు ఏసుడు, ఆఖరు నాడు అగ్గి గుండాలు తొక్కుడు, భక్తులు మొక్కులు తీర్చు కొనుడు. ఈ జాతరల గురించి తెలంగాణల తెలియని ప్రజలు వుండరు.
- ముగింపు :
చివరిగా ఈ రచయుత గొల్లల ఆరాధ్య దైవం అయిన మల్లన్న దేవుని పుట్టుక, వివాహం గురించి, కాటమారాజు గురించి, బీరప్ప కథ గురించి చెప్పడం జరిగింది. గొల్ల కులం వారికి కుల, మత బేధం ఉండదు. అన్ని కూలాలను ఆదరిస్తారు. ఆడి తప్పని మాట, నిజాయితీ, నిమ్మలత్వం, సకల సద్గుణాలు కలిగి వుంటారు. కానీ ఎంత మంచి వాళ్ళ కైనా వేప కాయంత వెర్రి వుంటుంది అనేది నానుడి. కొన్ని సందర్భాలలో కొంచెం బెట్టు చేస్తారు. పట్టు పడితే వదలరు.
మారు కాలంలొ గొల్ల కులంలొ కూడా మార్పులు వచ్చాయి. విద్య, రాజకీయం, ఉద్యోగం ఇలా అన్ని రంగాలలో కూడా తమకు ఒక ప్రత్యేక స్థానం కల్పించుకుంటున్నారు. ఉత్తర భారతదేశం వలె దక్షిణ భారతదేశంలో బాహుజనులను ఏకం చేసే సత్తా గొల్లలకే ఉందని, రాజకీయ బలం లేదా చైతన్యమే నిజమైన మార్పులు తెస్తుంది అని రచయిత బలంగా విశ్వసించడం అభినందనీయంగా చెప్పవచ్చు.