పుస్తక సమీక్ష : వర్తమానంపై సామాజిక వ్యాఖ్యానం : 'బుల్ డోజర్ సందర్భాలు'

By telugu news teamFirst Published Oct 7, 2023, 10:50 AM IST
Highlights

పాలకుల ద్వంద్వ నీతిని ఎండగడుతూ విశ్లేషణాత్మకమైన వ్యాసాలను రాయడంలో ఆయనకు ఆయనే సాటి. ఏ విషయాన్నీ తీసుకున్నా కానీ దాని పూర్వపరాలను చెప్పకుండా ఉండలేరు.

ఆంధ్రజ్యోతి  సంపాదకులు కె.శ్రీనివాస్ వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాల నుండి అరవై వ్యాసాలను ఎంపిక చేసి మలుపు బుక్స్ ప్రచురణగా 'బుల్ డోజర్ సందర్భాలు' పేరుతో వెలువరించారు.  వర్తమాన సామాజిక పరిస్థితికి నిదర్శనంగా నిలిచిన ఈ వ్యాస సంపుటి పైన  గోపగాని రవీందర్ రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :
                          

రోజు పత్రికలను చదివే అలవాటున్నవాళ్లకు ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ పేరు సుపరిచితమే. పాలకుల ద్వంద్వ నీతిని ఎండగడుతూ విశ్లేషణాత్మకమైన వ్యాసాలను రాయడంలో ఆయనకు ఆయనే సాటి. ఏ విషయాన్నీ తీసుకున్నా కానీ దాని పూర్వపరాలను చెప్పకుండా ఉండలేరు. రాజకీయపరమైన,ఆర్థికపరమైన, సాంఘిక పరమైన, సాహిత్య పరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి తనదైన కోణంలో వ్యాఖ్యానం చేస్తారు. ప్రతి గురువారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ' సందర్భం ' కాలమ్ చదివే వాళ్ళు అనేక మంది ఉంటారు. శ్రీనివాస్  వ్యాసం కోసం  ఎదురు చూస్తుంటారు.

పదును దేలిన పదజాలంతో, రంపపు కోత లాంటి వాక్యాలతో, విషయం లోతుల్లోకి వెళ్లి ఆయా రాజకీయ పార్టీల యొక్క భావజాలాన్ని ఆలోచనత్మకంగా, అద్భుతంగా ఆకట్టుకునే విధంగా వివరిస్తారు. ముఖ్యంగా మన దేశాన్ని గత దశాబ్దంగా పాలిస్తున్న మోదీ ప్రభుత్వ విధానాలను అనేక కోణాల్లో విడమర్చి విపులంగా సామాన్య ప్రజలకు తన అభిప్రాయాల్ని సాహసంగా వినిపిస్తున్నారు. ఆయన వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాల నుండి అరవై వ్యాసాలను ఎంపిక చేసి మలుపు బుక్స్ ప్రచురణగా 'బుల్ డోజర్ సందర్భాలు' పేరుతో వెలువరించారు. ఈ వ్యాస సంపుటి వర్తమాన సామాజిక పరిస్థితికి నిదర్శనంగా నిలిచింది.

ఈ పుస్తకానికి సామాజిక ఉద్యమకారులు ఆచార్య గంటా చక్రపాణి  రాసిన మాటల్లో ఇలా అంటున్నారు. ' నిర్దయగా అణిచివేత సాగుతున్న వేళ నిర్భయంగా నిలబడే మాట్లాడే వాళ్ళు అరుదు. ఇప్పుడున్న అప్రకటిత అత్యయిక దశలో బుద్ధి జీవులు, కవులు, రచయితలు, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలని విర్రవీగిన మహా మీడియా సంస్థలు, వాటి అధిపతులు, సహస్రావధాన సంపాదకులు, తలలు పండిన పాత్రికేయ పండితులు మాట పెగలక మూగబోయిన సందర్భంలో గొంతు సవరించుకొని నిర్మాణాత్మక నిరసనను నివేదిస్తున్న ఒకే ఒక పాత్రికేయుడు కె.శ్రీనివాస్. సంపాదకుడిగా సమన్యాయ సూత్రాలను పాటిస్తూనే బాధితుల పక్షాన నిలబడడానికి కత్తి మీద సాము చేస్తున్న సాహసి. నిరంతర అధ్యయనం, సమాజం పట్ల, దేశం పట్ల ముఖ్యంగా ప్రజల పట్ల ప్రేమ, వ్యక్తిగా జీవితంలో, పాత్రికేయుడుగా వృత్తిలో నైతిక నిబద్ధత వల్ల ఆయన సంక్షోభ సందర్భంలో కూడా నిలబడి మాట్లాడగలుగుతున్నాడు. విస్తు పోయి వినడమే తప్ప మరో మాటకు తావులేని కాలంలో శ్రీనివాస్ మాట ఒక అనునయ వాక్యం. కుట్ర చట్రాల్లో కునారిల్లుతున్న వారికి ఆయన దిక్కార స్వరం ఒక ధైర్యవచనం. మూక దాడులు, మూఢవిశ్వాసాల నడుమ భవిష్యత్తు మీద నమ్మకం నశిస్తున్న దశలో వర్తమానాన్ని చిత్రిక పడుతూ చేస్తున్న విశ్లేషణ భవిష్యత్తుకు ఒక కొత్త భరోసా.' ఎవరైనా ఇంతకంటే ఇంకా ఏమి చెప్పగలరు.

వారం వారం రాసే కాలమ్ లో పీడితుల పక్షాన నిలబడి గొంతు నిస్తున్న శ్రీనివాస్ వ్యాసాలు మనందరం చదవాల్సినవి. ఒక పద్ధతి ప్రకారం సామాన్యులకు దూరం అవుతున్న ప్రభుత్వ పాలన మీద సునిషితమైన విమర్శ ఉంది. అదేదో పనిగట్టుకుని చేసినట్టు కాదు. ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాల్ని ఎత్తిచూపటమే. ఏ పాలన అయినా కానీ రాజ్యాంగానికి లోబడే ఉండాలి కదా. ప్రజల విశ్వాసాల మీద అచంచలమైన ప్రేమను ప్రదర్శించాల్సిన ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందని ప్రశ్నిస్తున్నారు. 2021 నుండి ప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీని దేశ విభజన బీభత్సాన్ని స్మరించుకునే దినంగా పరిణమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సందర్భాన్ని పురస్కరించుకొని ' జ్ఞాపకం ఒక రాజకీయ ఆయుధం ' అని రాసిన వ్యాసంలోని ఈ వాక్యాలను ఒకసారి చదవండి. ఆయన ఆలోచన విధానమేమిటో అర్థమవుతుంది. '75 ఏళ్ల స్వాతంత్ర్యోత్సవాల ఆరంభంలోనే జరిగిన ఈ స్మారక దిన ప్రకటన దరిమిలా,  రానున్న ఏడాదిలో ఆ తర్వాత కూడా విస్తృతమైన చర్చ జరగవచ్చు. ఒకపక్క ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం, మరోపక్క 75 ఏళ్ల మైలురాయి, తొందర పెడుతున్న 2024 ఎజెండా, కేంద్ర ప్రభుత్వానికి క్రమంగా తగ్గుతున్న ప్రజాదరణ. వీటన్నిటి మధ్య దేశ విభజన చర్చకు ప్రత్యేకమైన ప్రయోజనం ఏమైనా ఉన్నదా తెలియదు. ప్రధాని ప్రకటనకు,  ఆయన మంత్రివర్గ సహచరుల అనంతర వాదనలకు ఉన్న తేడాను గమనిస్తే, పెద్ద స్థానంలో ఉన్నవారు ఎంత సాధు సంభాషణ చేసిన తక్కిన శ్రేణుల వారు ఉద్రేకాలనే ఝలిపిస్తారు. భారతీయ పౌర సమాజం ఈ చర్చ క్రమంలో ఎంతో నిగ్రహంతో వ్యవహరిస్తుందని, దేశభక్తులకు గట్టి సమాధానం ఇవ్వగలుగుతుందని ఆశించడం తప్ప ఏమీ చేయలేము'.

ఒక వ్యాసంలోని కొన్ని వాక్యాలను మాత్రమే ఉదాహరించాను. ఈ సంపుటి నిండా భారతీయ చరిత్ర మీద, ఉపా చట్టాల మీద, దళితులపై దాడుల మీద, మైనార్టీల హక్కుల మీద తనదైన తాత్వికత పరమైన ఆలోచనలను పంచుకున్నారు. వర్తమాన సామాజిక పాలన పరమైన వాటిని నిర్మొహమాటంగా , ఘాటైన పదజాలంతో వ్యక్తీకరించిన శ్రీనివాస్  వ్యాసాలను ఒక్కసారైనా చదవాల్సిందే. మనల్ని మనం బేరీజు వేసుకోవాల్సిందే. సామాజిక విశ్లేషకులు ఆచార్య జి. హర గోపాల్  ' మన దేశం ఎటుపోతున్నది?' అంటూ చిక్కని ముందుమాటను రాశారు. ' ఈ వ్యాసాల్లో ప్రధానంగా మతోన్మాదం పైనే కాక మీడియా, కశ్మీర్, దేశభక్తి, జాతీయత, ప్రజాస్వామ్యం, వ్యవస్థల విశ్వసనీయత వంటి అంశాలపై చర్చ కనిపిస్తుంది. ఈ అంశాల మీద ఒక స్పష్టమైన వైఖరి ఉంది. ఈయన కాలమ్ పైపై వివరాలనే కాక, చాలా ప్రాథమికమైన పునాదులదాకా స్పృశించడం వల్ల, తాత్కాలికమైన జర్నలిస్టు కథనంలాగా కాక, ఒక చారిత్రక వ్యాఖ్యానంగా అనిపిస్తాయి. భవిష్యత్తులో ఇవి చరిత్రకారులకు ఉపయోగపడతాయి '.   అందుకే ప్రజాస్వామ్యవాదులు, సామాజిక ఉద్యమకారులు మరియు  ప్రతి ఒక్కరు చదవాల్సిన అత్యుత్తమమైన వ్యాస సంపుటిది.
 

click me!