
అమ్మ (Mother Hood)అవ్వడం అనేది ప్రతి ఆడపిల్ల జీవితంలో ఓ ముఖ్యదశ. ఈ క్రమంలోనే ఆడపిల్ల గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి డెలివరీ అయ్యే వరకు శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కడుపులోని బిడ్డ కోసం 9 నెలలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తల్లి బిడ్డ పుట్టిన తరువాత తన గురించి,తన శరీరం గురించి, ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోదు. దాని వల్ల భవిష్యత్తులో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
వాటిని అధిగమించేందుకు ,డెలివరీ (Delivery) అయిన తరువాత కూడా శరీరాన్ని మళ్లీ బలంగా మార్చుకోవాలంటే సరైన ప్రణాళికలతో ముందుకు సాగాలి. ఇంటి వద్దనే చిన్న చిన్న వ్యాయమాలు చేయడం వల్ల శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ముందుగా వ్యాయామాన్ని ప్రారంభించే ముందు వైద్యుల సలహా తప్పనిసరి. ఎందుకంటే ఒక్కొక్కరి శరీరం ఒక్కో తీరుగా ఉంటుంది.
సాధారణంగా డెలివరీ తర్వాత కనీసం 6 వారాల వరకు శారీరక శ్రమను తగ్గించడమే మంచిది. ఆ తర్వాత మాత్రమే నెమ్మదిగా శరీరాన్ని అలవాటు చేయడం అవసరం. ముందుగా చిన్నచిన్న నడకలతో మొదలు పెట్టొచ్చు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో 10 నిమిషాలు నెమ్మదిగా నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది, శరీరం చురుకుగా మారుతుంది.
డెలివరీ సమయంలో కండరాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా కటిస్థాయి కండరాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయడం ద్వారా మూత్ర నియంత్రణలో సమస్యలు రాకుండా ఉండేలా చూసుకోవచ్చు. శారీరకంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమే. యోగా, మృదువైన శ్వాస వ్యాయామాలు మనసుకు రిలీఫ్ ఇస్తాయి. శిశువు సంరక్షణలో ఏర్పడే ఒత్తిడిని తగ్గించేందుకు ఇవి ఎంతో ఉపయోగకరం.
ఆహారపరంగా కూడా తల్లులు జాగ్రత్తగా ఉండాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. గుడ్లు, పాలు, ఆకుకూరలు, పండ్లు వంటి వాటిని ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. దీనితో పాటు జ్యూసులు అవి కూడా ఎక్కువ తీసుకోవాలి. శరీరం మళ్లీ శక్తివంతంగా మారేందుకు నిద్రది చాలా ముఖ్యం. బిడ్డ నిద్రించే సమయాల్లో తల్లులు కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించేందుకు, శక్తిని పునరుద్ధరించేందుకు ఇది చాలా అవసరం.
ఈ విధంగా, నిదానంగా మొదలుపెట్టి, శరీరానికి కావాల్సిన వ్యాయామం, ఆహారం, విశ్రాంతిని సమతుల్యంగా కలుపుకుంటే, తల్లి త్వరగా తన ఆరోగ్యాన్ని తిరిగి పొందగలదు.