ప్రతియేటా ఐదేళ్లలోపు ఎనిమిది లక్షల మందికి పైగా చిన్నారుల ప్రాణాలను రక్షించాలంటే తల్లులు పాలు పట్టే పద్దతి మరింత మెరుగు పడాలని యూనిసెఫ్ చెబుతోంది
న్యూఢిల్లీ: ప్రతియేటా ఐదేళ్లలోపు ఎనిమిది లక్షల మందికి పైగా చిన్నారుల ప్రాణాలను రక్షించాలంటే తల్లులు పాలు పట్టే పద్దతి మరింత మెరుగు పడాలని యూనిసెఫ్ చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం ప్రతి ఐదుగురిలో ముగ్గురు గానీ, 7.8 కోట్ల మంది నవజాత శిశువులకు గానీ పుట్టిన గంటలోపు తల్లిపాలు అందుబాటులో లేవని తేలింది. వీరు మనుగడ, అభివ్రుద్ధికి తక్కువ అవకాశాలు ఉంటాయి. మేధోసంపత్తి సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ పేర్కొన్నాయి.
భారతదేశంతోపాటు స్వల్ప ఆదాయం, మధ్య ఆదాయ దేశాల్లో జన్మిస్తున్న నవజాత శిశువుల్లో 41.5 శాతం మందికి, 2.6 కోట్ల మందికి పుట్టిన గంటలోపు తల్లి పాలు అందడం లేదని తేలింది. ఈ నేపథ్యంలో నవ జాత శిశువులకు సకాలంలో తల్లి పాలు అందేలా చర్యలు తీసుకునేందుకు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ‘అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవం’ నిర్వహిస్తోంది.
భారతదేశంలో 2015లో జన్మించిన, మూడేళ్లలోపు నవజాత శిశువుల్లో 41.5 శాతం మందికి జన్మనిచ్చిన గంట సేపట్లో తల్లిపాలు లభించాయి. 2005లో 23.4 శాతం మందికి పుట్టిన గంటలో తల్లిపాలు అందాయి. తద్భిన్నంగా అంతర్జాతీయంగా పుట్టిన గంటలోపు బాలలకు తల్లిపాలు అందని వారి సంఖ్య 37 శాతం నుంచి 42 శాతానికి పెరిగిందని యూనిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నాయి.
యూనిసెఫ్ భారత్ ప్రతినిధి యాస్మిన్ అలీ హేగ్ మాట్లాడుతూ భారతదేశంలో దశాబ్ద కాలంలో పుట్టిన నవజాత శిశువుల్లో గంటలోపు తల్లిపాలు అందుతున్న వారి సంఖ్య రెట్టింపైందన్నారు. మానవత్వ కోణంలో పిల్లల ప్రాణాలను రక్షించేందుకు తల్లిపాలు అందించాలన్సి ఉన్నదని యాస్మిన్ అలీ హేగ్ చెప్పారు.
ఎయిమ్స్ గైనకాలజీ, ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఆల్కా కృపాలానీ మాట్లాడుతూ ‘ప్రసవం జరిగిన కొద్ది రోజులు తల్లులు తమ పిల్లలకు చిక్కని, పసుపు రంగులో పాలు ఇస్తారు. వీటిల్లో వ్యాధుల నిరోధక వ్యవస్థ గల యాంటీ బాడీస్, పౌష్టికాహార విలువల గల ఆహారం లభిస్తుంది. తొలి నెలలో 22 శాతం మందికి పిల్లలకు ప్రాణహాని నివారించడానికి వీలు కల్పిస్తుంది’ అని చెప్పారు. ఆశ్చర్యకరమైన రీతిలో సంస్థాగత జననాలు పెరుగుతున్నా కొద్దీ పిల్లలకు తల్లిపాలు ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2005 నుంచి 2017 వరకు 58 దేశాల్లో ప్రసవాలు 18 శాతం పెరిగాయని యూనిసెఫ్ తెలిపింది.
ఎయిమ్స్ గైనకాలజీ, ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఆల్కా కృపాలానీ మాట్లాడుతూ పుట్టిన ప్రతి శిశువు ఆరు నెలల పాటు తల్లిపాలు తాగితేనే వ్యాధుల నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లి పాలకు బదులు ఇతర ఆహారాలు, ద్రవ పదార్థాలు ఇవ్వొద్దన్నారు. తల్లిపాల వల్ల ఇన్‌ఫెక్షన్లు తగ్గుముఖం పట్టడంతోపాటు మేధో సంపత్తి పెరుగడంతోపాటు మెరుగైన పౌష్టికాహారం లభిస్తుందన్నారు.