యూజీసీ ఓ సంచలన నిర్ణయానికి రంగం సిద్ధం చేస్తున్నది. కేంద్ర యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ లేకున్నా అసిస్టెంట్ ప్రొఫెసర్‌లుగా నియమించుకునే విధానంపై ఆలోచనలు చేస్తున్నది. తద్వారా పీహెచ్‌డీ లేకున్నా అపార అనుభవం కలిగిన పలు పరిశ్రమల నిపుణులతో యూనివర్సిటీ విద్యార్థులకు బోధనలు చేయించే అవకాశాలను పరిశీలిస్తున్నది. ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నది. త్వరలోనే తుది నిర్ణయం వెలువడనుంది.
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంచలన నిర్ణయం తీసుకోవడానికి యోచిస్తున్నది. కేంద్ర యూనివర్సిటీల్లో(University) పీహెచ్‌డీ(PhD) పట్టా లేకున్నా అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant Professor)లను నియమించుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నది. ఈ మేరకు ఓ ప్రకటనలో యూజీసీ (UGC) వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా పలు పరిశ్రమల్లోని పీహెచ్‌డీ లేని నిపుణుల ద్వారా బోధనలు చేయించడానికి వీలు అవుతుందని భావిస్తున్నది.
అలాంటి బోధకుల కోసం ప్రత్యేక పొజిషన్‌ను సృష్టించే యోచనలో ఉన్నది. పీహెచ్‌డీ పట్టా లేకుండా విశ్వవిద్యాలయాల్లో నియమించుకునే వారి కోసం ప్రత్యేకంగా ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌గా గుర్తించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ పోస్టు కింద నియమించుకునే ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోబోతున్నది.
undefined
అంతేకాదు, ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా పీహెచ్‌డీ లేని టీచర్లకూ యూనివర్సిటీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే అవకాశం ఏర్పడనుంది. పలు రంగాల్లోని ఎంతో నైపుణ్యం ఉండి పీహెచ్‌డీ లేని కారణంగా యూనివర్సిటీల్లో బోధించలేకపోతున్న వారికి ఈ వెసులుబాటు ఉపకరించనుంది.
అయితే, ఈ నిర్ణయం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది. దీనిపై తుది నిర్ణయం త్వరలోనే యూజీసీ ప్రకటించనుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటానికి ముందు.. ఇందుకు కావాల్సిన వివరాలు, సమాలోచనలు చేయడానికి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది.
పీహెచ్‌డీ లేకున్నా యూనివర్సిటీల్లో బోధకులుగా తీసుకునే వారిని శాశ్వతంగా నియమిస్తుందా? లేక తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుంటుందా? అనే విషయంపై స్పష్టత లేదు. వీరిని పార్ట్ టైమ్ బోధకులుగా తీసుకోవచ్చు. వీరి నియామకాలు ఆ విశ్వవిద్యాలయం అవసరాలను బట్టి ఉంటుంది.
ప్రొఫెసర్ల నియామకాలపై ఇటీవలే కేంద్ర ప్రభు్తవం యూజీసీ రెగ్యులేషన్స్ సవరించిన సంగతి తెలిసిందే. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు పీహెచ్‌డీని కనీస అర్హతగా కేంద్రం ఓ నిబంధన తెచ్చింది. ఈ రెగ్యులషన్ 2021ను అమల్లోకి రావాల్సి ఉండింది. కానీ, కరోనా కారణంగా ఆ రెగ్యులేషన్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ రెగ్యులేషన్‌ను 2023 జులై వరకు వాయిదా వేశారు. దీంతో ప్రస్తుతం యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా నియామకాలు జరుగుతున్నాయి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు పీహెచ్‌డీ కనీస అర్హతగా పాటించే నిర్ణయాన్ని కరోనా కారణంగా జులై 1వ తేదీ 2021 నుంచి జులై 1వ తేదీ 2023 వరకు వాయిదా వేస్తున్నామని యూజీసీ ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్‌లోని వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో చేరడానికి ఇష్టపడే అభ్యర్థులు NIT వరంగల్ అధికారిక వెబ్‌సైట్ nitw.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోండి
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), వరంగల్ ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 17 మార్చి 2022లోగా తమ దరఖాస్తును చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య కారణంగా, అభ్యర్థులు చివరి నిమిషంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి మీ దరఖాస్తును వీలైనంత త్వరగా పూర్తి చేయండి.
NIT వరంగల్ రిక్రూట్‌మెంట్ ద్వారా 99 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు సంస్థలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులపై నియమిస్తారు. రిక్రూట్‌మెంట్‌లో మొత్తం ఖాళీల సంఖ్య 99. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు.