Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ వ్యాప్తి తర్వాత పలు దేశాల్లో కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. బ్రిటన్ లో అయితే, కరోనా పంజా మాములుగా లేదు. ఒక్కరోజే 1,22,186 కొత్త కేసులు నమోదుకావడం, అందులో ఒమిక్రాన్ కేసులు అధికంగా ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
Coronavirus:గత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ దాదాపు 100 దేశాలకు వ్యాపించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత పలు దేశాల్లో కోవిడ్-19 కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుం దక్షిణాఫ్రికా, అమెరికాలతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ పంజా కారణంగా కొత్త కేసులు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. బ్రిటన్ లో అయితే, పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదుకావడం, వారిలో ఆరోగ్య సిబ్బంది సైతం అధికంగా ఉండటం అక్కడి ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అక్కడ వరుసగా మూడో రోజుకూడా లక్షలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం అక్కడ కరోనా వైరస్ విజృంభణకు అద్దం పడుతోంది. అక్కడి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో బ్రిటన్ లో మొత్తం 1,22,186 కేసులు నమోదయ్యాయి. మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా బ్రిటన్ రాజధాని లండన్‌లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ ప్రతి 20 మందిలో కరోనా బారినపడే అవకాశలున్నాయనే అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
undefined
ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బ్రిటన్ Office for National Statistics (ONS) చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ అంచనాల ప్రకారం డిసెంబర్ 16 నాటికి లండన్ లో ప్రతి 20 మందిలో ఒకరు కరోనా వైరస్ బారినపడే అవకాశముందని తెలిపింది. ఆదివారం నాటికి ఇది ప్రతి పది మందిలో ఒకరు కొవిడ్ బారిన పడే అవకాశం ఉండొచ్చని ముందస్తు అంచనాలను వెల్లడించింది. అలాగే, కొత్తగా దేశంలో గత 24 గంటల్లో మొత్తం 137 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 1,47,857కు పెరిగింది. యూరప్ దేశాల్లో నమోదైన అత్యధిక మరణాలు బ్రిటన్ లోనే నమోదయ్యాయి. బ్రిటన్ లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. లండన్ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. మరోవైపు ప్రజల్లో కొందరు కోవిడ్-19 టీకాలు తీసుకోవడానికి నిరాకరించడం పై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కాట్లాండ్ ఒక్కటే ఉందని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. అక్క డిసెంబర్ 19 నాటికి అక్కడ ప్రతి 65 మందిలో ఒకరికి కరోనా సోకిందని తెలిపింది.
Also Read: వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసింది.. కేంద్రంపై మంత్రి హరీష్ రావు విమర్శలు
అలాగే, ఇంగ్లండ్‌లో ప్రతి 35 మందిలో ఒకరికి ఈ వైరస్ సోకి ఉంటుందని Office for National Statistics (ONS) అంచనా వేసింది. ఆదివారం నాటికి ఆ పరిస్థితి 25 మందిలో ఒకరు స్థాయికి చేరనుందని పేర్కొంది. ఇదిలావుండగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఇదిరకటి వేరియంట్ల కంటే రెట్టింపు స్థాయిలో ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆస్పత్రిలో చేరే పరిస్థితులు తక్కువగానే ఉంటాయని పలువురు నిపుణులు అంచనా వేశారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ గురించి పూర్తి డేటా ఇంకా అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాలు ఖచ్చితమైన ఓ నిర్ణయానికి రావడం లేదు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 279,411,079 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 5,411,307 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు, మరణాలు అధికంగా అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, స్పెయిన్ లు టాప్-10 లో ఉన్నాయి.
Also Read: రామతీర్ధం ఘటనలో వైసీపీ, టీడీపీలదే బాధ్యత.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్