నడి సంద్రంలో మునిగిన పడవ.. 11 మంది మృతి.. కొనసాగుతున్న గాలింపులు

By Mahesh KFirst Published Dec 24, 2021, 11:51 PM IST
Highlights

మధ్యప్రాచ్య దేశాల నుంచి శరణార్థులుగా ఐరోపా దేశాలకు ఇంకా తరలి వెళ్తూనే ఉన్నారు. ఈ సముద్ర ప్రయాణాల్లో వారు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నారు. వేలాది మంది సముద్రంలో గల్లంతైపోయారు. తాజాగా, గ్రీసు సమీపంలో మరో ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం శరణార్థులతో వెళ్తున్న ఓ పడవ మునిగింది. ఇప్పటి వరకు 11 మృతదేహాలు లభించాయి.
 

న్యూఢిల్లీ: మధ్యప్రాచ్య దేశాల(Middle East) నుంచి శరణార్థుల సముద్ర(Sea) ప్రయాణం జీవితాలతో చెలగాటం అవుతున్నది. స్వదేశంలో జీవించే పరిస్థితులే కరువు కావడంతో ప్రాణాల మీద గుప్పెడు ఆశలతో కఠినమైన సముద్ర ప్రయాణాన్ని నమ్ముకుంటున్నారు. అదృష్టవంతులు యూరప్ దేశాల దాకా వెళ్తున్నారు. కొందరు మానవ అక్రమ రవాణా మాఫియా చేతుల్లో చిక్కిపోతున్నారు. ఇంకొందరు సముద్రంలోనే జల సమాధి అవుతున్నారు. ఆ సముద్రంలో ఎంత మంది మరణిస్తున్నా.. రోజువారీ జీవితమే జీవన్మరణ సమస్యగా మారడంతో మరో దారి లేక సముద్ర దారిని ఎంచుకుంటున్నారు. ఎన్నోసార్లు సముద్రంలో నౌక మునక(Boat sink), మృతుల వార్తలు వచ్చాయి. తాజాగా, మరోసారి అలాంటి ఘటనే జరిగింది. గ్రీస్(Greece) తీరంలో శరణార్థులను మోసు కెళ్తున్న ఓ పడవ నీట మునిగింది.

గ్రీస్ సమీపంలో గురువారం సాయత్రం పడవ నీటిలో మునిగిపోయింది. అంటికైతెరా ద్వీపానికి ఉత్తరాన ఓ చిన్న ద్వీపం దగ్గర మునిగింది. పడవ నీటి అడుక్కు వెళ్లిపోయింది. కాగా, కొందరు ఆ చిన్న ద్వీపాన్ని అందుకోగలిగారు. కాగా, గురువారం రాత్రి ఆ చిన్ని ద్వీపంపైనే చిక్కుకుపోయారు. మరికొందరు సముద్ర జలాల్లో తప్పిపోయారు. గ్రీసు తీర గస్తీ దళాలకు ఈ విషయం తెలిసింది. వెంటనే మునిగిన వారి కోసం గాలింపులు జరిపారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను కనుగొనగలిగారు. చిన్న ద్వీపంపై చిక్కుకున్న 90 మందినీ అధికారులు కాపాడగలిగారు .అందులో 27 మంది చిన్నారులున్నారు. 11 మంది మహిళలు, 52 మంది పురుషులు ఉన్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తీసుకు రాగలిగారు.

Also Read: సముద్ర తీరంలో ఈదురు గాలుల బీభత్సం.. 8 మంది మత్స్యకారుల గల్లంతు..

అయితే, ఆ పడవపై ఎంత మంది ప్రయాణం చేస్తున్నారు అనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికైతే 11 మంది మృత దేహలను అధికారులు వెలికి తీయగలిగారు. ఈ సంఖ్యపై స్పష్టత లేనందున గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎంత మంది నీట మునిగారన్న విషయం తెలియదు. ఈ ఘటనకు ఒక రోజు ముందే గ్రీసుకు చెందిన ఫోల్‌గాండ్రోస్ దీవి సమీపంలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు. అయితే, ఆ పడవపై ఎంత మంది ప్రయాణిస్తున్నారు అనే విషయంపైనా స్పష్టత లేదు.

ఆ దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన వారు.. ప్రమాదానికి ముందు పడవలో 32 మంది ఉన్నారని చెప్పారు. కాగా, అధికారులు మాత్రం సుమారు 50 మంది వరకు ఉండే అవకాశం ఉన్నదని తెలిపారు. ఎయిజియన్ సముద్రంలో ఈ ఏడాది చోటుచేసుకున్న అత్యంత దారుణమైన ప్రమాదంగా యూఎన్‌హెచ్‌సీఆర్ పేర్కొంది. జీవన భద్రత కోసం ప్రజలు ఇప్పటికీ ప్రాణాలు పణంగా పెట్టే పరిస్థితిని ఈ పడవ ప్రమాదాలు తరుచూ గుర్తు చేస్తున్నాయని గ్రీసులోని యూఎన్‌హెచ్‌సీఆర్ అసిస్టెంట్ రిప్రజెంటేటివ్ అడ్రియానో సిల్వెస్త్రి వివరించారు.

Also Read: మునిగిపోతున్న బోట్‌పై నుంచి భయంతో కేకలు.. నీటిలో దూకేసిన ప్రయాణికులు.. ఇదే వీడియో

సురక్షిత జీవితం కోసం యూరప్ దేశాలకు వెళ్లాలన్న లక్ష్యంతో బయల్దేరిన వారిలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో సుమారు 2,500 మంది మార్గమధ్యంలో అంటే సముద్రంలోనే గల్లంతయ్యారు. 2015లో సిరియా నుంచి సుమారు పది లక్షల మంది శరణార్థులు గ్రీసు దీవులు దాటి టర్కీ మీదుగా ఐరోపా సమాఖ్య దేశాలను చేరుకున్నారు.

click me!