ప్రతీకార సుంకాలతో ప్రపంచంపై ఒక్కసారిగా దాడి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాలపై అమలు చేయనున్నట్లు ప్రకటించిన సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చైనా విషయంలో మాత్రం తగ్గేదేలా అని తేల్చి చెప్పారు. ఇంతకీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు.? అసలు తెర వెనకాల ఏం జరిగింది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. 75 దేశాలకు రెసిప్రొకల్ టారిఫ్‌పై 90 రోజుల తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ ద్వారా చెప్పారు. అంతేకాదు, చైనాపై సీరియస్ యాక్షన్ తీసుకుంటూ, అక్కడి నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌ను వెంటనే 125 శాతానికి పెంచేశారు.
ఈ సమయంలో ట్రంప్ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఇకపై చైనా అన్యాయపు వ్యాపారాల్ని అస్సలు భరించదని తేల్చి చెప్పారు.
ట్రంప్ వేసిన టారిఫ్‌ల దెబ్బకు అమెరికా మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది. టారిఫ్ వార్ వల్ల ప్రపంచ మార్కెట్లలో దాదాపు 10 లక్షల కోట్ల డాలర్ల నష్టం వచ్చింది. అయితే, ట్రంప్ టారిఫ్‌పై తాత్కాలిక నిషేధం విధించగానే, కొన్ని గంటల్లోనే అమెరికా స్టాక్ మార్కెట్ విలువ దాదాపు 3.1 లక్షల కోట్ల డాలర్లు పెరిగింది. అంతకుముందు ట్రంప్ సలహాదారులు, ఎలాన్ మస్క్ కూడా టారిఫ్ వార్ ఆపమని సలహా ఇచ్చారు.
టారిఫ్‌లు వేసిన తర్వాత అమెరికాలో చాలా ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. అమెరికన్ బాండ్లను అమ్మడం పెరిగింది. ముడి చమురు ధరలు కూడా బాగా పడిపోయాయి. పరిస్థితులు కరోనా టైమ్స్ అప్పటిలా మారాయి. ఈ కారణంతో ట్రంప్ వెనకడుగు వేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టారిఫ్‌లు ఇలాగే కొనసాగితే అమెరికాలో రేట్లు పెరిగిపోతాయని, ఉద్యోగాలు పోతాయని, ఆర్థిక వ్యవస్థ పడిపోతుందని పెద్ద బ్యాంకులు హెచ్చరించాయి. అమెరికా ప్రతి సంవత్సరం చైనా నుంచి దాదాపు 440 బిలియన్ డాలర్ల వస్తువులు దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు దానిపై 124% టారిఫ్ వేశారు. దీనివల్ల చైనా నుంచి వస్తువులు కొనడం చాలా ఖరీదు అవుతాయి. అమెరికన్ కంపెనీలకు కొత్త, తక్కువ రేటుకు సప్లయర్లను వెతకడం పెద్ద టాస్క్ అవుతుంది. మరి చైనా విషయంలో ట్రంప్ తన నిర్ణయాన్ని కొనసాగిస్తారా.? లేదా చూడాలి.