అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్దం కొనసాగుతోంది. ఇప్పటికే ఇరుదేశాలు ఒకరిపై మరొకరు భారీగా సుంకాలు పెంచుకున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరో షాక్ ఇచ్చారు.
అగ్రరాజ్యం అమెరికా పాలనాపగ్గాలు రెండోసారి చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చైనాను టార్గెట్ చేసారు... ఆ దేశంనుండి వచ్చే వస్తువులపై సుంకం భారీగా పెంచేసారు. ఇప్పుడు చైనా నుంచి అమెరికాకి వచ్చే వస్తువులపై 245% సుంకం వేస్తున్నారు. ముందుగా చైనాపై 145% సుంకం పెంచింది అమెరికా... కానీ చైనా కూడా అమెరికాపై సుంకాలను భారీగా పెంచింది. దీంతో ట్రంప్ ఇగో దెబ్బతిన్నట్లుంది... అందుకే చైనాపై సుంకాలను మరింతగా పెంచారు.
చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఇప్పుడు 245% సుంకం వసూలు చేస్తామని వైట్ హౌస్ మంగళవారం ప్రకటించింది. ఇది చాలా పెద్ద, కఠిన నిర్ణయం అని అనుకుంటున్నారు. ఇండియతో పాటు చాలా దేశాలపై సుంకాలు పెంచిన అమెరికా అములు మాత్రం 90 రోజుల గడువు విధించింది... కానీ ఒక్క చైనాపై మాత్రం వెంటనే సుంకాల పెంపు అమల్లోకి తెచ్చింది. చైనా తన తప్పు ఒప్పుకోకుండా అమెరికాపై సుంకాలుపెంచుతోంది... అందుకే తాము కూడా పెంచుతున్నామని అమెరికా అంటోంది.
అమెరికా సుంకాల పెంపుకు 90 రోజుల గడువు ఇచ్చింది... దీంతో ఆయా దేశాలు అగ్రరాజ్యతో వ్యాపార ఒప్పందాలకు సిద్దమవుతున్నారు. తద్వారా తమపై సుంకాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా ఇండియా, అమెరికా మధ్య కూడా చర్చలు మొదలయ్యాయి. మే నెల నుంచి సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉంది.
ఇతర దేశాల వస్తువులపై తక్కువ సుంకం వసూలు చేస్తున్నాం, కానీ అమెరికా వస్తువులు ఎగుమతి చేస్తే చైనా, ఇండియా లాంటి దేశాలు ఎక్కువ సుంకం వసూలు చేస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం అంటోంది. చైనా మొండిగా వ్యవహరిస్తోంది, ప్రపంచంలో దాదాపు 75 దేశాలు అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అందుకే చాలా దేశాలకు 90 రోజుల గడువు ఇచ్చింది అమెరికా. ఈలోపు చర్చలు జరిపి ఒప్పందానికి రావచ్చు.
ఈ 90 రోజుల్లో కేవలం 10% ప్రాథమిక సుంకం మాత్రమే ఉంటుంది. ఇండియాపై కూడా అమెరికా 26% సుంకం విధించింది, కానీ ప్రస్తుతానికి దాన్ని ఆపేసింది. చర్యల తర్వాత సుంకాలపై తుది నిర్ణయం తీసుకోనుంది ట్రంప్ సర్కార్.