అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు యావత్ ప్రపంచంపై ప్రభావం పడుతున్నాయి. భారత్‌సహా అనేక దేశాలపై బుధవారం నుంచి ప్రతీకార సుంకాలను అమలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాలను వెడ్‌బుష్ టెక్ విశ్లేషకుడు డేనియల్ ఐవ్స్ కీలక విషయాలను ప్రస్తావించారు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల కారణంగా టెక్ రంగం రెండు నష్టాలను ఎదుర్కోనుందని ఐవ్స్ అభిప్రాయపడ్డారు. సుంకాల చుట్టూ ఉన్న అనిశ్చితి అన్ని పరిశ్రమలపై ప్రభావం అపడే అవకాశం ఉందని మరీ ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) ప్రాజెక్టులపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఆర్థిక వ్యవస్థ మందగించడం, ధరలు పెరగడం కారణంగా టెక్ కంపెనీలు ముఖ్యంగా AI ప్రాజెక్టులపై ఖర్చును తగ్గిస్తాయని అంచనా వేస్తున్నారు. ట్రంప్ సుంకాలు సమీప భవిష్యత్తులో AI వ్యయం వృద్ధి పథాన్ని మార్చగలవనే భయాల కారణంగానే స్టాక్ ప్రతికూలంగా స్పందించిందని ఐవ్స్ అభిప్రాయపడ్డారు.
వినియోగదారులపై పడే సుంకాల భారం కారణంగా సంస్థల వ్యయం, పెట్టుబడులు, ప్రకటనల డిజిటల్ డాలర్లపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన అన్నారు. ఇక రెండో అంశం విషయానికొస్తే.. అమెరికా టెక్ కంపెనీలకు ఏఐ టెక్నాలజీకి అవసరమయ్యే చిప్ సరఫర గొలుసుకు చైనా అతిపెద్ద వనరు అని ఐవ్స్ తెలిపారు. ట్రంప్ నిర్ణయంతో బీజింగ్ ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
సెమీకండక్టర్ పరిశ్రమ ఆసియాలో స్థిరపడిందని చైనా దీనికి పునాదిగా ఉందని ఐవ్స్ తెలిపారు. సరఫరా గొలుసులో 10% ఆసియా నుంచి అమెరికాకు తరలించడానికి కూడా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఇందుకోసం బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది అని చెప్పుకొచ్చారు. చైనా దూకుడుగా ప్రతీకార చర్యలు తీసుకుంటే అది ఐటీ రంగంపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. తదుపరి తరం ఎన్విడియా కార్పొరేషన్ (NVDA) చిప్‌లు లేదా హార్డ్‌వేర్ కోసం సరఫరా గొలుసును పరిమితం చేయవచ్చు.
ఇదిలా ఉంటే అన్ని దేశాలపై ట్రంప్ విధించిన పరస్పర సుంకాలు బుధవారం నుండి అమలులోకి వచ్చాయి. దీనిని ట్రంప్ "విమోచన దినం"గా అభివర్ణించారు. ఈ నిర్ణయంతో అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. స్టాక్‌ట్విట్స్‌లో, టెక్నాలజీ సెలెక్ట్ సెక్టార్ SPDR ఫండ్ (XLK) పట్ల రిటైల్ సెంటిమెంట్ 'బేరిష్' (29/100)గా ఉంది. సుంకాలు అమలులోకి రావడంతో మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ ప్రతీకార సుంకాల చర్యతో భారతీయ ఐటీ నిపుణులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న సంస్థలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని అంటున్నారు.