
Omicron: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. గత నెలలో దక్షిణాఫ్రికాలో బయటపడిన ఓమిక్రాన్.. అతి తక్కువ కాలంలో ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఇప్పటివరకూ 63 దేశాలకు విస్తరించింది. డెల్టా వేరియంట్ కన్నా ప్రమాదకరంగా ఓమిక్రాన్ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 7816 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మరో 78,398 మంది శాంపిల్స్ పరీక్షలో ఉన్నాయి. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
అయితే.. మరోవైపు యూకేలో ఓమిక్రాన్ విజృంభన కొనసాగుతోంది. ఈ దేశంలోనే అత్యధికంగా, అతివేగంగా కేసులు నమోదయ్యాయి. యూకేలో ఇప్పటి వరకూ 3,137 కేసులు నమోదు కాగా.. డెన్మార్క్ లో 2471, దక్షిణాఫ్రికాలో 779, ఇండియాలో 42 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే.. యూకేలో ఈ పరిస్థితి ఇలానే ఉంటే.. అత్యంత వేగంగా విస్తరిస్తోందని, అడ్డుకట్ట వేయకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నాటికి 25 వేల నుంచి 75 వేల మరణాలు సంభవించే అవకాశముందని ఓ అధ్యయనం వెల్లడించింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్(ఎల్‌ఎస్‌హెచ్‌టిఎమ్) శాస్త్రవేత్తలు హెచ్చరించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రబలమైన కరోనావైరస్ వేరియంట్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
Read Also: కరోనా కలవరం... ఒమిక్రాన్ లో మూడు సబ్ వేరియంట్స్..!
అంతేకాదు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా 60 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్, దక్షిణాఫ్రికాలోని స్టెల్లెన్‌బోష్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత, టీకాల ప్రభావం ఆధారంగా వారు ఈ నిర్ణయానికి వచ్చారు.
ఒమిక్రాన్ అణచివేతకు ఇప్పటి నుంచే కఠిన చర్యలు తీసుకోకపోతే గతేడాది ఆల్ఫా వేరియంట్ విరుచుకుపడినప్పుడు తలెత్తిన కేసుల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. దీని వ్యాప్తి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, రోగ నిరోధకశక్తి ఉన్నకూడా ఈ వైరస్ బారినపడే అవకాశం ఉందని పేర్కొంది. డిసెంబర్ 1 నుంచి ఏప్రిల్ చివరి వరకూ మొత్తం 1,75,000 ఈ వేరియంట్ తో హాస్పిటల్ ల్లో చేరుతారనీ, దాదాపు 24,700 మంది ఈ వేరియంట్ కు బలవుతారని హెచ్చరించింది.
Read Also: హ్యాకింగ్ కు గురైన బ్రెజిల్ ఆరోగ్య శాఖ వెబ్ సైట్.. వ్యాక్సినేషన్ డాటా చోరీ..
శనివారం ఒక్కరోజే.. UKలో 633 ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయనీ, ఇంత మొత్తంలో ఈ వేరియంట్ కేసులు బయటపడటం ఇదే తొలిసారని UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. దీంతో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 1,898కి చేరిందని తెలిపింది. మరోవైపు యూకేలో కరోన విజృంభిస్తోంది.
శనివారం మరో 54,073 కొత్త కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయనీ, అదే సమయంలో 132 మంది మరణించినట్టు తెలిపింది.
Read Also ; అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం..!
డెల్టా వేరియంట్ కంటే.. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందనీ, ముందస్తు ప్రణాళికలు, వ్యాక్సినేషన్ ను గణనీయంగా పెంచితేనే.. ఈ వేరియంట్ ప్రమాదం నుంచి తప్పించుకోగలమని వైద్యనిపుణులు హెచ్చరిస్తోన్నారు.