
గతేడాది భారత్‌లో కరోనా (coronavirus) సమయంలో ఎక్కువగా వినిపించిన సంస్థ “తబ్లిగీ జమాత్” (tablighi jamaat ) గుర్తుండే వుంటుంది. తొలినాళ్లలో దేశంలో అదుపులోనే వున్న కోవిడ్ విధ్వంసం సృష్టించడానికి ఈ సంస్థే కారణమంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా తబ్లిగీ జమాత్ వార్తల్లోకెక్కింది. సౌదీ అరేబియా ప్రభుత్వం (saudi arabia government) ఈ సంస్థపై నిషేధం విధించింది.
ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి (terrorism).. తబ్లిగీ జమాత్ ఒక మార్గమని ఆ సంస్థను ఉద్దేశించి సౌదీ సర్కార్ వ్యాఖ్యానించింది. తబ్లిగీ జమాత్‌తో సమాజానికి ముప్పు పొంచి ఉందని ప్రజలకు తెలియజేయాలని మసీదులు, ముస్లిం మత బోధకులను ప్రభుత్వం ఆదేశించింది. ఆ సంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి డా. అబ్దుల్ లతీఫ్ అల్ షేక్ ఓ ప్రకటనలో తెలిపారు.
ALso Read:"రంజాన్ వరకు లాక్ డౌన్ పొడిగించండి, లేకపోతే మరో తబ్లీగి జమాతే"....
స్వచ్ఛమైన” ఇస్లాం”కు ముస్లింలు తిరిగి రావాలనే లక్ష్యంతో 1926లో మౌలానా మహ్మద్ ఇలియాస్.. తబ్లిగీ జమాత్ ఉద్యమాన్ని హర్యానాలోని నుహూలో ప్రారంభించారు. ముస్లింలను ప్రోత్సహించడం, సున్నీ ఇస్లాంను అనుసరించాలని ప్రచారం చేయడం ఈ సంస్థ విధి. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో తబ్లిగీ జమాత్ శాఖలు ఉన్నాయి. ఈ సంస్థ ముఖ్య కార్యాలయం ఢిల్లీలోని నిజాముద్దీన్ లో (nizamuddin) ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35-30 కోట్ల మంది ముస్లింలు.. తబ్లిగీని అనుసరిస్తున్నట్లు సమాచారం.
ఇండోనేసియా, మలేసియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్ వంటి దేశాల్లో తబ్లిగీలు కోట్లల్లో ఉన్నారు. మనదేశంలోనూ పలు ప్రాంతాల్లో ఏటా తబ్లిగీ జమాత్ భారీ ఎత్తున మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. అయితే తబ్లిగీ జమాత్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఎన్నోసార్లు ఆరోపణలు వచ్చాయి. కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో దీనికి సంబంధాలున్నాయని 2011లో “వికిలీక్స్” (wikileaks ) సంచలన ఆరోపణలు చేసింది. ఉగ్రవాదులకు డబ్బు, వీసాలు తబ్లిగీ ద్వారా అందుతున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను జమాత్ ప్రతినిధులు ఖండించారు.