
India Pakistan: భారత్ దెబ్బకు పాకిస్తాన్ లో పేలుళ్ల మోత మోగుతోంది. ఈ క్రమంలోనే లాహోర్‌లో పాకిస్తాన్ ప్రధాని నివాసం సమీపంలో పేలుళ్లు జరిగాయి. ఇండియా ఆపరేషన్ సింధూర్ అనంతరం ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ లు బంకర్లలోకి వెళ్లారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
లాహోర్ నగరంలో మే 7 న జరిగిన వరుస పేలుళ్లు పాకిస్తాన్ రాజకీయ, సైనిక వర్గాల్లో ఆందోళన కలిగించాయి. ఈ పేలుళ్లు వాల్టన్ విమానాశ్రయం, లాహోర్ కంటోన్‌మెంట్ ప్రాంతాల్లో సంభవించాయి. ఈ ప్రాంతాలు ప్రధాన సైనిక కట్టడాలు, ముఖ్యంగా రావల్పిండీలోని జనరల్ హెడ్క్వార్టర్స్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికార నివాసానికి సమీపంలో ఉన్నాయి. పేలుళ్ల సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నివాస ప్రాంతం కూడా సమీపంలో ఉన్నట్టు సమాచారం.
ఈ ఘటనలు భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య చోటు చేసుకున్నాయి. మే 7 వ తేదీ తెల్లవారుజామున భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), పాకిస్తాన్ లోపల ఉగ్రవాద శిబిరాలపై సమన్వితంగా దీర్ఘదూర, అధిక ఖచ్చితత్వ గల ఆయుధాలతో దాడి జరిపాయి. ఈ దాడిలో తొమ్మిది ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయని, 100కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం.
ఈ ఆపరేషన్, ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీసుకోవడమే లక్ష్యంగా చేపట్టబడింది. ఆ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన నివాసాన్ని వదిలి బంకర్లో తలదాచుకున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. గురువారం రాత్రి సమయంలో పాకిస్తాన్ సైన్యం భారతదేశంలోని పలు సైనిక స్థావరాలపై డ్రోన్‌లు, క్షిపణులతో పెద్ద ఎత్తున దాడికి యత్నించినప్పటికీ, భారత సాయుధ దళాలు వీటిని విజయవంతంగా తిప్పికొట్టాయి. లాహోర్‌లో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా భారత దళాలు ధ్వంసం చేశాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
భారత దళాల ప్రతీకార దాడులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, ఉగ్రవాదుల ఖచ్చితమైన హతాల సంఖ్య ఇప్పటికీ తేలలేదని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ఘటనల నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అయితే అధికారిక స్థాయిలో ఇరు దేశాల నుంచి పూర్తి స్పందన ఇంకా రాలేదు.