
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలపై తన అధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత వస్తువులపై 50 శాతం దిగుమతి సుంకం విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ఇవ్వాళ అర్థరాత్రి (ఆగస్టు 27) నుంచి అధికారికంగా అమలులోకి వస్తుంది. ఈ తరుణంలో చైనా ను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కావాలనుకుంటే చైనాపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. పరోక్షంగా ప్రపంచ దేశాలను బెదిరించారు.
వాస్తవానికి భారత్- అమెరికా మధ్య టారిఫ్ యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మన శత్రు దేశమైన చైనాతో అమెరికా సంబంధాలు మెరుగుపడుతాయని చాలామంది భావించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా దూసుకపోతుందనీ, ఉత్పతిలో ఇతర దేశాలను శాసిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, చైనా ఆశలు గల్లంతయ్యాయి. ట్రంప్ స్నేహం అందిస్తాడని భావిస్తే.. చైనాకు కూడా టారిఫ్ కత్తిని చూపించాడనే చెప్పాలి. స్నేహం వేరు, శత్రుత్వం వేరు అనేలా వ్యవహరిస్తున్నారు.
భారత వస్తువులపై 50 శాతం దిగుమతి సుంకం అమలు కాబోతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజింగ్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటూనే.. వాణిజ్య వివాదాల్లో అమెరికా పైచేయి ఉన్నట్లు స్పష్టం చేశారు. అమెరికాతో పోటీపడితే చైనా నాశనమవుతుందని పరోక్షంగా హెచ్చరించారు. అమెరికా వద్ద కొన్ని 'కార్డులు' ఉన్నాయని, వాటిని ప్రస్తుతానికి ఆడకూడదని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు.
వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. “వాళ్ల దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయి. కానీ మా దగ్గర అంతకంటే పెద్ద కార్డులు ఉన్నాయి. నేను వాటితో ఆడాలనుకోవడం లేదు. ఒకవేళ ఆ కార్డులతో ఆడితే, చైనా నాశనమవుతుంది. అందువల్ల ప్రస్తుతానికి ఆ పని చేయను.”అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్రంప్ ప్రకారం.. అరుదైన ఖనిజాల సరఫరా నిలిపివేయడం వంటి చైనా చర్యలకు తీవ్రమైన ప్రతిఘటనలు ఉంటాయని హెచ్చరించారు. అవసరమైతే, చైనాపై 200 శాతం వరకు సుంకాలు విధించడానికి కూడా వెనుకాడవోమని తెలిపారు.
అదే సమయంలో, ఇరు దేశాల మధ్య సత్సంబంధాల ప్రాముఖ్యతను ట్రంప్ హైలైట్ చేశారు. ఈ ఏడాది చివర్లో గానీ, ఆ తర్వాత కొద్దికాలానికి గానీ నేను చైనా పర్యటనకు వెళ్తాను. రెండు దేశాల మధ్య అద్భుతమైన సంబంధాలు ఏర్పడబోతున్నాయి” అని తెలిపారు. ప్రస్తుతం వాణిజ్య విభేదాలు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో సంబంధాలు మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో అమెరికా కోశాధికారి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ దాడుల తర్వాత భారత్ రష్యా చమురు వ్యాపారంలో భారీ లాభాలను పొందిందని చెప్పారు. గతంలో భారతదేశం రష్యా చమురు దిగుమతిలో 1%కంటే తక్కువ భాగం పొందినప్పటికీ, ఈ వ్యాపారం 42%కి పెరిగిందని తెలిపారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య విభేదంలో సగం సుంకం ఇప్పటికే అమలులో ఉంది. మిగతా సగం ఆగస్టు 27 నుండి అమల్లోకి రానుంది. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు, చైనా-భారత్-అమెరికా వ్యూహాలను గ్లోబల్ మార్కెట్లలో కొత్త పరిణామాలకు దారితీస్తాయనే చెప్పాలి.