
మూడు రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన సమావేశమయ్యారు. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధంపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే భారత్-రష్యా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు జరిపారు.
ఇండియాపై ట్రంప్ 50% సుంకంపై చర్చ
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 50% సుంకం విధించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఇండియా పరోక్షంగా ఆర్థిక సాయం చేస్తోందనికూాడా ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జైశంకర్, పుతిన్ భేటీకి అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీకి ముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో జైశంకర్ భేటీ అయ్యారు.
వాణిజ్య సంబంధాలు బలోపేతం
రష్యాతో వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేయాలని జైశంకర్ నొక్కి చెప్పారు. రష్యన్ కంపెనీలు ఇండియన్ కంపెనీలతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇరు దేశాలు వాణిజ్య వైవిధ్యాన్ని పెంచుకోవాలని, ఉమ్మడి ప్రయత్నాలు పెంచాలని కూడా సూచించారు.
గత నాలుగేళ్లలో ఇండియా-రష్యా వాణిజ్యం ఐదు రెట్లు పెరిగింది. 2021లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం 2024-25 నాటికి 68 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే ఇండియా వాణిజ్య లోటు 6.6 బిలియన్ డాలర్ల నుంచి 59 బిలియన్ డాలర్లకు పెరిగిందని జైశంకర్ గుర్తు చేశారు.
భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో చర్చలు
ఈ చర్చలు సంక్లిష్ట భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో జరుగుతున్నాయని జైశంకర్ అంగీకరించారు. ఢిల్లీ, మాస్కోల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని… నిరంతరంగా కొనసాగుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి, "సుంకాలు, ఇతర అడ్డంకులను తొలగించడం, రవాణా సమస్యలను పరిష్కరించడం, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా మార్గం, ఉత్తర సముద్ర మార్గం, చెన్నై-వ్లాడివోస్టాక్ మార్గం ద్వారా అనుసంధానాన్ని మెరుగుపరచడం, సులభమైన చెల్లింపు విధానాలను నిర్ధారించడం" వంటి అంశాలపై చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.